కుంకుడుకాయలను కేవలం తలకే కాదు.. ఇన్ని విధాలుగా వాడొచ్చు తెలుసా..?

-

ఇప్పుడు అందరూ జుట్టుకు షాంపూలే వాడుతున్నారు. కుంకుడుకాయలతో తలస్నానం చేసేవాళ్లు చాలా అరుదు. కుంకుడుకాయలంటే.. కేవలం తలస్నానం చేయడానికి వాడేవి మాత్రమే అనుకుంటున్నారు కదూ. కుంకుడుకాయలను ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. షాంపూలతో తలస్నానం చేసిన దానికి కుంకుడుకాయలతో చేసినదానికి చాలా తేడా ఉంటుంది. కుంకుడికాయలతో చేస్తే మీ పుర్రె చాలా శుభ్రంపడుతుంది. చాలా క్లీన్‌గా అనిపిస్తుంది.

జుట్టు కోసం మరిన్ని ఉపయోగాలు :

కుంకుడు కాయలు సహజంగా చేదుగా ఉంటాయి. వాటిని రాసుకున్నప్పుడు మాడు మీద ఫంగస్‌ పెరగకుండా ఉంటుంది. అందుకనే కుంకుడు కాయలతో మాత్రమే తలస్నానం చేసే వారిలో చుండ్రు సంబంధిత సమస్యలు తలెత్తవు.

కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. అలాంటి సమస్య ఉన్నవారు వీటితో తలస్నానం చేయడం వల్ల క్రమంగా సమస్య తగ్గుతుంది.

కుంకుడు కాయలతో స్నానం చేస్తే జట్టు కాస్త బిరుసుగా మారుతుందని చాలా మంది భయపడుతుంటారు. వీటితో గోరింటాకును కలిపి తలస్నానం చేయాలి. అప్పుడు జుట్టు డ్రై అవ్వకుండా కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది.

వీటిలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జుట్టు ఊడే సమస్యలు తగ్గుముఖం పడతాయి.

అన్నింటికీ ఒకటే లిక్విడ్‌ :

ఇంగ్లీష్‌లో కుంకుడుకాయల రసాన్ని ఆల్‌ పర్పస్‌ షాంపూ అని పిలుస్తారు. దీన్ని జంతువులకు స్నానం చేయించడానికి, కార్లు, మోటార్‌ సైకిళ్లలాంటివి కడుక్కోవడానికి, ఆభరణాలు శుభ్రం చేసుకోవడానికి కూడా వాడవచ్చు.

రసాయన రహితంగా ఇంటిని క్లీన్‌ చేసుకోవాలనుకునేవారు కాస్త కుంకుడుకాయల రసాన్ని బకెట్‌ నీళ్లలో వేసి ఇంటికి తడి గుడ్డ పెట్టుకోవచ్చు.

సింకులు, టాయిలెట్లు, బాత్‌ టబ్బులు లాంటి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాల వల్ల ఇవన్నీ చక్కగా శుభ్ర పడతాయి.

మగవారు షేవింగ్‌ క్రీంలా కూడా దీన్ని వాడేయొచ్చట. అలాగే సబ్బులు వాడకుండా బట్టలు ఉతకడానికీ, సామాన్లు తోమడానికీ కూడా ఇది పనికి వస్తుందట.

వీటిలో మొక్కలకు తెగుళ్లను నివారించే లక్షణమూ ఉంది. కొన్ని కుంకుడు కాయల్ని చితక్కొట్టి నానబెట్టి రసం తీసి వడగట్టాలి. ఆ రసాన్ని నీటిలో కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. ఇలా ఇది సహజమైన పురుగుమందుగానూ పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version