టీ కాంగ్రెస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారా !

-

టీఆర్‌ఎస్‌ దూకుడు ఒకవైపు..మరోవైపు పొంచి ఉన్న బీజేపీ ముప్పు. సునామీలా ప్రమాదాలు ముంచుకొస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక పేచీ. అది పీసీసీ పదవైనా..ఇంకే కార్యక్రమమైనా నాయకులది అదే వైఖరి. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒక్కో నేత ఒక్కో యాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నా నేతల మధ్య విభేదాలు మాత్రం కేడర్ ని కలవర పెడుతున్నాయి…

దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పడిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఇద్దరు కార్పొరేటర్లతో సర్దుకుంది. ఇలా రాష్ట్రంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నా.. కాంగ్రెస్ నాయకుల్లో కలిసి పనిచేసే కల్చర్‌ కనిపించడం లేదు. అలాంటి ఆలోచన ఉన్నా.. ఆచరణలో పెడితే అట్టడుగుకు తొక్కేస్తారనే భయంతో పాత పద్ధతిలోనే వెళ్తున్నారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తున్నారు. అంతకుముందు అచ్చంపేటలో సభ నిర్వహించారు. ఆ సభకంటే ముందు ఆర్మూర్‌లో రైతు దీక్ష చేశారు. ఈ దీక్షపై కాంగ్రెస్‌లో చర్చ కాకుండా రచ్చ అయింది. కొందరు సీనియర్లు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే దీక్షలు చేయడం ఏంటని ఢిల్లీకి పంపిన ఫిర్యాదుల్లో ప్రశ్నించారట. పార్టీ సీనియర్లు సైతం రేవంత్‌ పాదయాత్రకు హైకమాండ్‌ అనుమతి ఉందా లేదా అని చర్చ తీసుకొచ్చారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం రైతులతో ముఖాముఖీ చేపట్టారు. ఆదిలాబాద్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రగతి భవన్‌ ముట్టడి అని ఆయన ఇప్పటికే షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరి.. పార్టీ పెద్దలు ఓకే చెప్పారో లేదో కానీ..ఆయన మాత్రం ప్రగతి భవన్‌ వరకు పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేస్తున్నారు.

ఇలా సీనియర్లంతా కలిసి కట్టుగా కాకుండా తలోదారి ఎంచుకోవడంపై పార్టీలో చర్చతోపాటు విమర్శలు రేగుతున్నాయి. ఈ అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశమై పాదయాత్ర ప్లాన్‌ చేసుకుని పార్టీ అంతా కలిసి నడిస్తే బాగుండేదని కొందరి అభిప్రాయం. పార్టీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి కనబరిచే శ్రద్ధ.. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేలా ఉమ్మడి కార్యాచరణ చేపడితే బాగుండేదని కేడర్‌ అభిప్రాయ పడుతోందట.

తెలంగాణలో పాదయాత్ర చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. దానికంటే ముందుగానే యాత్ర మొదలు పెట్టాలని రేవంత్‌ అనుకున్నారట. ప్రస్తుత యాత్రను ఈ నెల 16న సరూర్‌ నగర్‌ స్టేడియం వరకు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదేరోజు భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారట. దీని తర్వాత ములుగు నుంచి మరో పాదయాత్రకు ప్లాన్ చేశారట. యాత్రల సంగతి బాగానే ఉన్నా మరి నేతల ఫిర్యాదులు చూసిన కేడర్ మా నేతలు మాత్రం మారరు అంటూ నిట్టూరుస్తున్నారట….

Read more RELATED
Recommended to you

Exit mobile version