హైదరాబాద్ శివారు ప్రాంతమైన శాద్‌నగర్ టోల్ ప్లాజా సమీపంలో దిశ అనే యువతిని నలుగురు మృగాళ్లు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ప్రాణం వుండగానే దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హృదయ విదారక సంఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి.
మానవత్వం మంటగలిపిన మానవ మృగాలని నిర్ధాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలంతా డిమాండ్ చేశారు. ఆ తరువాత సీన్ రికన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు మృగాళ్లు ఎన్‌కౌంటర్‌కు గురికావడం తెలిసిందే. ఇదే అంశాన్ని తన `దిశ ఎన్‌కౌంటర్` సినిమాకు కథగా ఎంచుకుని వర్మ తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన దిశ తండ్రి వెంటనే ఈ సినిమాని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సెన్సార్ బోర్డ్‌ని ఆదేశించాలంటూ హై కోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ నవీన్ రావు విచారణ చేపట్టారు.