ప్రస్తుత తరుణంలో సైబర్ మోసాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. మోసగాళ్లు వింత వింత పద్ధతుల్లో జనాల డబ్బును కాజేస్తున్నారు. పోలీసులు, బ్యాంకులు ఎంత హెచ్చరించినా జనాలు కూడా ఏమరుపాటుగా ఉంటున్నారు. దీంతో మోసగాళ్లు పెద్ద ఎత్తున అందినకాడికి సొమ్మును దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గిఫ్ట్ వచ్చిందని చెబుతూ, స్పిన్ వీల్ కాంటెస్ట్‌లో గెలిచారని నమ్మిస్తూ.. మోసగాళ్లు డబ్బులను దోచుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో స్పిన్ వీల్ మోసాలు ఎక్కువైపోయాయి. జనాలకు వాట్సాప్‌లో, ఎస్ఎంఎస్‌ల రూపంలో స్పిన్ వీల్ కాంటెస్ట్‌లో పాల్గొనాలని మెసేజ్‌లు వస్తున్నాయి. వారు ఆశపడి మెసేజ్‌లలో ఇచ్చే లింక్ లను ఓపెన్ చేస్తున్నారు. అయితే అవి ఫేక్ కాంటెస్ట్‌లు కనుక అందులో ఏదో ఒక ఖరీదైన గిఫ్ట్‌ను వచ్చేలా మోసగాళ్లు సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీల్‌ను తిప్పగానే అందులో ఖరీదైన గిఫ్ట్ తగులుతుంది. అది నిజమే అని నమ్మే కొందరు మోసగాళ్లను కాంటాక్ట్ అవుతున్నారు. గిఫ్ట్‌ను అందుకునే పంపించే నెపంతో మోసగాళ్లు ప్రజలకు కొన్ని లింక్‌లను పంపుతున్నారు. వాటిల్లో బ్యాంకింగ్ సమాచారం ఎంటర్ చేయగానే బ్యాంకుల్లో ఉన్న నగదు కాస్తా నిమిషాల వ్యవధిలోనే స్వాహా అవుతోంది. దీంతో విషయం గ్రహించే బాధితులు లబోదిబోమంటున్నారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి స్పిన్ వీల్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఎక్కువ సంఖ్యలో ఆశ్రయిస్తున్నారు. దీంతో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు. గిఫ్ట్‌లను ఇస్తామని, స్పిన్ వీల్ కాంటెస్ట్‌లో పాల్గొనాలని ఎవరైనా లింక్‌లను పంపితే అవి నిజమే అని నమ్మి వాటిని ఓపెన్ చేయకూడదని, డబ్బులను నష్టపోవద్దని హెచ్చరిస్తున్నారు. కనుక మీకు కూడా అలాంటి మెసేజ్‌లు వస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఓపెన్ చేయకండి. చేస్తే డబ్బు నష్టపోవడం ఖాయం. కనుక అలాంటి స్కీమ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి.