బతుకమ్మ పేర్చే పూల ప్రత్యేకతలు తెలుసా!!

-

బతుకమ్మ పండుగ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ. ప్రకృతితో మమైకం అయ్యే పండుగ. చిన్నా పెద్ద, పేద, ధనిక అనే బేధభావనలు లేకుండా అమ్మను తన్మయత్వంతో ఆరాధించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యింది. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు. అయితే బతుకమ్మలో ఉపయోగించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం… బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు.

అంతేకాదు బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి, అందానికి ఎంగానో తోడ్పడుతాయి. మరి ఆ పూలేంటో.. వాటితో వచ్చే లాభాలేంటో చాలా మందికి తెలియదు. ముందుగా ప్రధానమైన పువ్వులు..

 

తంగేడు పూలు.. బతుకమ్మ ముందు వరసలో ఉండేవి తంగేడు పూలు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, మలబద్దకానికి ఇది మంచి ఔషదం. తంగేడు పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి.

రెండోది తామర పూలు.. తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్దకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమపుప్పు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.

మూడోది గునుగు పూలు.. ఇది గడ్డిజాతికి చెందిన పువ్వు. దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఇక బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. ఈ పువ్వును చర్మం పై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగు రంగులో ఆరుబయట పూసి ఉంటాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం గునుగు పూలు, తంగేడు పూలు అలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు.

వీటిలో బంతి, చామంతి వర్షాకాలం దోమల నివారణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నందివర్ధనం ప్రత్యేక గుణాలు కల పుష్పం. దీనివల్ల కండ్లకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఇది పలు ఆయుర్వేద ఔషధాల్లో, చిట్కావైద్యంలో ఉపయోగిస్తారు.

బతుకమ్మ పేర్చే పూలన్నింటిని గమనిస్తే అవన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవి (ఒకప్పుడు). అంతేకాదు అవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఎవ్వరికైనా సులభంగా, పైసలు అవసరం లేకుండా దొరుకుతాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రకృతిలో దొరికే అమూల్యమైన పూలే మన బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు.

వాటిని వర్ష, శీతాకాల సంధి సమయంలో ఉపయోగించడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా, నిండుకుండల్లాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. వీటన్నింటి వెనుక సైన్స్ ఉందంటే మనం నమ్మం కానీ ఏదో ఒకరోజు నాసా లాంటి వారు వచ్చి చెప్తారు. అప్పుడు నమ్ముతాం. ఏది ఏమైనా బతుకమ్మ నిజంగా మన బతుకులలో రంగురంగుల పూల పండుగే. రోటీన్ లైఫ్‌కు భిన్నంగా దూరమవుతున్న ఆప్యాయతలు, పలకరింపులను కాపాడే ఆత్మీయ పండుగ.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version