సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా పరిచితులైన కృష్ణ బాల్యం గురించి.. ఇండస్ట్రీకి తేనె మనసులు చిత్రంలో కథానాయకుడిగా పరిచయం కాకముందు జరిగిన సంఘటనల గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి.. ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో బుర్రిపాలెం లో.. 1943 మే 31 మధ్యాహ్నం 12:05 గంటల సమయంలో తెనాలిలోని డాక్టర్ సుందర రామయ్య ఆసుపత్రిలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి , నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు.
కృష్ణ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం.. అందరిలో కృష్ణ పెద్దవారు కావడం విశేషం. నిర్మాతలు హనుమంతరావు , ఆది శేషగిరిరావు ఆయనకు స్వయానా తమ్ముళ్లు. ఆయన బాల్యమంతా ఎక్కువగా తెనాలిలోని గడిచిపోయింది. కృష్ణ తండ్రి వ్యవసాయంతో పాటు కలప వ్యాపారం కూడా చేసేవారు. వారిది మధ్యతరగతి కుటుంబమని పలు సందర్భాలలో కృష్ణ తెలియజేసిన విషయం తెలిసిందే. పదో తరగతి వరకు తెనాలిలోనే చదువుకున్న కృష్ణ ఆయనను ఇంజనీర్ గా చూడాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అందుకని ఇంటర్లో ఎంపీసీ తీసుకొని చదివారు. గుంటూరులో ఇంజనీరింగ్ సీటు లభించకపోవడంతో నర్సాపూర్ కాలేజీలో చేరి మూడు నెలలు చదివిన తర్వాత టిసి తీసుకొని ఏలూరులోని సి ఆర్ రెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యి బిఎస్సి పూర్తి చేశారు.
తర్వాత తల్లిదండ్రులు ఇంజనీర్ చేయాలనుకున్నా..సీటు లభించకపోవడంతో కృష్ణ పెద్దగా బాధపడలేదు. పైగా ఆనందపడ్డారు. ఎందుకంటే బీఎస్సీలో చేరే సమయానికి మనసు సినిమాల వైపు వెళ్ళింది. కుమారుడిని ఏం చేయాలని తండ్రి ఆలోచిస్తుంటే.. కృష్ణ తన తండ్రితో తన మనసులో మాట చెప్పారట. సరే నీ ఇష్టం అంటూ కుమారుడిని రాఘవయ్య చౌదరి సినిమాలలోకి పంపించారు.అలా తెనాలిలో తనతో పాటు కలిసి మెలిసి తిరిగిన మిత్రుడు మోహిని స్టూడియోస్ అధినేత చక్రపానికి తన కుమారుడి గురించి లేఖ రాశారు. ఇక ఆ తర్వాత స్నేహితుడు రాజగోపాల వెంకటరత్నం చేత ఆయన అల్లుడు ఆనందబాబుకు లేఖ రాయించారు. ఆనందబాబు ఎవరో కాదు ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కుమారుడు. తండ్రి ఇచ్చిన రెండు లేఖలతో కృష్ణ మద్రాస్ లోకి అడుగుపెట్టి.. ఎన్నో కష్టాల తర్వాత ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.