సంక్రాంతి అంటే..పెద్దోళ్లకు కోడిపందాలు..ఇక యూత్‌కి పతంగులే ఆనందం. సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరవేయటం ఆనవాయితి. అసలు ఎక్కడు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ సంప్రదాయం…అందరూ ఎగరవేస్తారు. సంక్రాంతి పండగ రాకముందు నుంచే ఈ పతంగుల జాతర మొదలవుతుంది. ఇక పండగ రోజు పిల్లలు.. పెద్దలు అంటూ తేడా లేకుండా రకరకాల గాలిపటాలు తెచ్చుకుని పోటీలు పెట్టుకుని మరీ ఎగరేస్తారు. కోడిపందాలపై ఆంక్షలు ఉన్నాయికానీ..పతంగులు ఎగరవేయటం మీద ఎక్కడా ఆంక్షలు కూడా లేకపోవడంతో..అందరూ ఈ గాలిపటాలు ఎగరవేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకు ఈ పండగకే ఎగరేస్తారు.. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా..ఈరోజు చూద్దాం.
సరదా కోసం కాదు..సమాచారం కోసం
పతంగులను మొదటి సారిగా చైనాలో ఎగరవేసారట. సుమారుగా 2000 సంవత్సరాల కిందట అక్కడే ఎగరేసారట. అయితే సరదా కోసం కాకుండా ఆత్మ రక్షణ కోసం ఈ పతంగులను ఎగరవేసేవారని సమాచారం. కాగా ఎవరికైనా సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ గాలిపటాలను ఉపయోగించేవారు. అప్పట్లో కేవలం వీటిని సమాచారాన్ని చేరవేసేందుకే వాడేవారు. ముఖ్యంగా వీటిని మిలటరీలోనే ఎక్కువగా ఉపయోగించేవరాట . అయితే అప్పటి గాలి పటాలు ఇప్పటిలా పల్చగా కాకుండా దీర్ఘచతురస్ర ఆకారంలో చాలా మందంగా ఉండేవి.
క్రీ. పూ. 206లో చైనాలోని హేన్ రాజుల చరిత్రకు గాలి పటానికి దగ్గర సంబంధం ఉందని చరిత్ర చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ హేన్ రాజుల చరిత్ర మొదలు కావడానికి అసలు కారణం గాలిపటమేనట. హేన్ చక్రవర్తి ఓ కోటను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారట. దానికోసం ఆ కోట ఎంత పొడవుందో తెలుసుకోవడానికి గాలిపటాన్ని ఉపయోగించారు. ఆ గాలిపటం సాయంతో ఆ కోట పొడవెంతో తెలుసుకుని..అంత పొడవు సొరంగాన్ని తవ్వించారు.ఆ తర్వాత తన సైన్యంతో కలిసి ఆ కోటను స్వాధీనం చేసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.
సంక్రాంతి రోజు ఎందుకంటే..!
ఇక సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను ఎగరవేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావని ఈ సంప్రాదాయాన్ని తెచ్చారట. ఉదయాన్నే ఎండలో నిలబడి పతంగులను ఎగరేయడం వల్ల శరీరం పై సూర్య కిరణాలు నేరుగా పడి డీ విటమిన్ లభిస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని శరీరంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేదపరంగా తెలుస్తుంది.
అలా మొదలైన పతంగులు ఇప్పుడు సంక్రాంతి సరదా సంప్రదాయంగా మారాయి. ఇంతకీ మీకు ఎగరవేసే అలవాటు ఉందా..!
– Triveni Buskarowthu