యంగ్ అండ్ డైనమిక్ సీఎం గా పేరొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 47వ ఏట లో కూడా చాలా ఆరోగ్యంగా హీరోల మాదిరి ఫిట్ గా కనిపిస్తున్నారు. ఆయన యువకుడిలా కనిపించడానికి అతని జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణమని చాలా మంది చెబుతుంటారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో కేవలం శాకాహారమే తీసుకుంటున్న జగన్ చికెన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినరట. గత పాతిక సంవత్సరాల నుండి జగన్ చికెన్ అంటేనే ఆమడ దూరం వెళ్లి పోతున్నారట. 1996 వ సంవత్సరానికి ముందు జగన్ కి చికెన్ అంటే అత్యంత ఇష్టం. అప్పట్లో సోదరి షర్మిల, జగన్ చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ 1996వ సంవత్సరం తర్వాత ఒక బలమైన కారణం వల్ల జగన్ తనకు ఇష్టమైన చికెన్ ని తినడం మానేశారని విజయమ్మ నాలో- నాతో వైయస్సార్ పుస్తకంలో రాశారు.
1996వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జీవితంలో ఏనాడు ఓటమి ఎరుగని ఒకే ఒక నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి అరుదైన రికార్డుని కలిగి ఉన్నారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి కి కడప పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడలేని టెన్షన్ పట్టుకుంది. 1996 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమయంలో వైయస్సార్ కుటుంబంలో ఎంతో టెన్షన్ మొదలైంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్నికలలో గెలుస్తామన్న ఆశలన్నీ వదిలేసుకున్నారు. ముఖ్యంగా జగన్, షర్మిల బాగా ఆందోళన చెందారు. తన నాన్న ఎన్నికల్లో గెలవాలని షర్మిల ఆరోజు మొత్తం ఉపవాస దీక్షకు పూనుకున్నారు.
జగన్ మాత్రం దేవుడి వద్దకు వెళ్లి తన తండ్రి గెలిస్తే తన కిష్టమైన చికెన్ ని వదిలేస్తానని ప్రార్థించారు. అయితే జగన్, షర్మిల కోరికలు నిజమయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1996 లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చికెన్ ని ముట్టుకోలేదు.