కరోనా వైరస్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన, రైలు సర్వీసులను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అని చెప్పిన కేంద్రం ఆ తర్వాత దానిని పెంచుతూ మే 3 వరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 14 నుంచి అన్ని రైలు సర్వీసులు నడుస్తాయని, ముఖ్యంగా వలస కూలీలకు ఇబ్బంది లేకుండా రైలు సర్వీసులను నడిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
దీనిపై కేంద్ర రైల్వే శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తను నమ్మి వేలాది మంది కూలీలు ముంబై రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. దీనితో సీరియస్ అయిన రైల్వే శాఖ… దేశవ్యాప్తంగా మే 3 వరకూ… ప్రయాణికుల రైళ్లేవీ నడపట్లేదనీ… ప్రత్యేక రైళ్లేవీ నడపట్లేదనీ పేర్కొంది. అదే విధంగా దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. ఏ ప్రకటనైనా అధికారికంగా వచ్చేది మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.
ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కలిగించాలని మీడియా సంస్థలను రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రైల్వే శాఖ 15523 రైళ్లను నడుపుతోంది. వీటిలో 9000 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 3000 మెయిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నాయి. గూడ్స్ సర్వీసులను మాత్రమే నడిపిస్తుంది రైల్వే శాఖ.