ఇంజినీరింగ్ విద్యార్థులకు షాక్.. భారీగా పెరగనున్న కళాశాలల ఫీజులు

-

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం 2025-26 నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈసారి సీబీఐటీ ఏడాది ఫీజును రూ.2.23 లక్సలుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ కాలేజీలతో పాటు వీఎన్ఆర్, ఎంజీఐటీ తదితర కళాశాలలకు కూడా ట్యూషన్ ఫీజు రూ.2లక్షలకు చేరుకున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్ల బ్లాక్ పిరియడ్ కు కొత్త ఫీజులను ఫిక్స్ చేసేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ గత నెల 25వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో విచారణ జరిపింది.

కాలేజీలు గతంలో సమర్పించిన గత మూడేళ్ల ఆడిట్ నివేదికలను పరిశీలించి కొత్త ఫీజులను యాజమాన్య ప్రతినిధులకు కమిటీ తెలియజేసింది. దాదాపు అన్ని కాలేజీల యాజమాన్యాలు కమిటీ చెప్పిన ఫీజుకు ఒప్పుకున్నాయి. కొన్ని కాలేజీలకు భారీగా పెరగగా.. మరికొన్నింటికీ నామమాత్రంగానే పెరిగాయి. గతంలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రముఖ కళాశాలలకు తక్కువ ఫీజు పెంచారని.. దీంతో ఈసారి ఆ కాలేజీలకు ఎక్కువగా పెరిగాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం పరిశీలించి త్వరలోనే జీవో జారీ చేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version