ప్రతీ ఒక్కరూ భయపడతారు.. కొందరే దాన్నుండి బయటపడతారు.. ఈ కథ చదవండి.

-

అనగనగా ఒక ఊరిలో ఒక ముసలివాడు ఉండేవాడు. ఆ ముసలివాడిని ఊర్లు తిరగడమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక చోటికి తిరుగుతూనే ఉంటాడు. అలా ఒకసారి మంచుకొండలకు పయనమయ్యాడు. తెల్లటి మంచుకొండల మీద నల్లటి ఆకాశాన్ని చూస్తూ మైమరిచిపోతున్నాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగా ఒకరోజు సాయంకాలం తొందరగా చీకట్లు కమ్ముకున్నాయి. ఆరోజెందుకో ముసలివాడు అలసిపోయాడు. నడవలేకపోతున్నాడు. అందుకని అక్కడ ఉన్న మంచు కొండను తను పట్టే విధంగా తవ్వుకున్నాడు.

అలా తవ్వుతున్నప్పుడు సడెన్ గా అక్కడ సొరంగం కనిపించింది. మంచు పెళ్ళలు రాలి పడగా సొరంగా బయటపడింది. అందులో నుండి లోపలికి ప్రవేశించిన ముసలివాడికి వెచ్చగా అనిపించింది. అక్కడే పడుకుందామని ఇంకా కొద్ది దూరం నడిచేసరికి ఏదో జీవి కదులుతున్నట్లు అనిపించింది. ముసలివాడి అడుగుల చప్పుడుకు ఆ జీవి మేల్కొంది. దాన్ని చూసిన ముసలివాడు భయపడ్డాడు. పారిపోదాం అన్న ఆలోచన మనసులోకి వచ్చినప్పటికీ తమాయించుకున్నాడు.

అప్పుడు ఆ జీవి ఇలా అంది.. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడకు వచ్చావు? నన్ను చూసి బతికి బట్టకట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. నిన్ను చంపేస్తా అని అరిచింది. దానికి ముసలివాడిలో వణుకు పుట్టింది. అపుడు, ముసలివాడు ఇలా అన్నాడు. సరే నన్ను తినెయ్. కానీ దానికంటే ముందు మా సాంప్రదాయం ప్రకారం ఒక నాట్యం చేసుకోనివ్వు అంటాడు. చనిపోయే ముందు ఇది తప్పకుండా చేయాల్సింది అని చెబుతాడు. ఆశ్చర్యపోయిన ఆ జీవి సరే అంది.

ముసలివాడు తన చేతిలో ఏదో పోసుకుని కాళ్ళకి చేతులకు రాస్తూ నాట్యం చేస్తున్నాడు. అలా తన చేతిలో ఉన్న కర్రతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అంతే కొద్ది క్షణాల్లో కర్ర అంటుకుంది. నిప్పుతో ఆ గుహ మొత్తం వెలుగు జిమ్మింది. ఆ జీవికి భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి పారిపోయింది.

చాలామందిని భయం వెంటాడుతూ ఉంటుంది. కొందరు మాత్రమే దాన్ని తమ వెంటపడకుండా చూసుకుంటారు. ప్రతీ ఒక్కరూ భయపడతారు. వారు ఎలాంటి వారైనా, ఎంత గొప్పవారైనా భయం తప్పనిసరి. కానీ, భయం తమని వేటాడడాన్ని వారు ఇష్టపడరు. మీరు కూడా భయపడండి. కానీ భయం మిమ్మల్ని వెంటాడకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version