సీజన్ మొదలైందంటే చాలు.. రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. పొలం దున్నడం, విత్తనాలు, చల్లడం, ఎరువులు వేయడం, పంటకు నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఒకదాని వెనుక ఒక పని చేస్తూనే ఉంటారు. అయితే ఈ పనుల్లో చాలా వాటికి కూలీలు అవసరం. కానీ సీజన్ సమయంలో కూలీలు దొరకడం కొంత కష్టమే అవుతుంది. అయితే ఇలాంటి కష్టాలను అధిగమించేందుకు ఎస్కార్ట్ లిమిటెడ్ అనే కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. ఆ ఆలోచననే ఆచరణలో పెట్టి నూతన తరహా ట్రాక్టర్లను ఆవిష్కరించింది.
ఎస్కార్ట్ లిమిటెడ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ట్రాక్టర్లలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే.. వీటికి డ్రైవర్ అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. డ్రైవర్ లేకుండానే ఈ ట్రాక్టర్లు నడుస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే.. మొబైల్ యాప్‌ల ద్వారా.. అవును, ఆ యాప్‌ల ద్వారా ట్రాక్టర్లను ఆపరేట్ చేయవచ్చు. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం తదితర పనులను ఈ ట్రాక్టర్లు చేస్తాయి. ఇందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) సహాయం తీసుకున్నట్లు ఎస్కార్ట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
డ్రైవర్ లెస్ ట్రాక్టర్లను రూపొందించడానికి ఎస్కార్ట్ లిమిటెడ్ కంపెనీ మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్ తదితర సాఫ్ట్‌వేర్ కంపెనీల సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే త్వరలో అధిక సంఖ్యలో డ్రైవర్ లెస్ ట్రాక్టర్లను విడుదల చేయాలని ఎస్కార్ట్ లిమిటెడ్ కంపెనీ భావిస్తోంది.