రాష్ట్రంలో సాగునీరు లేక లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిందని వ్యవసాయ శాఖ అధికారులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఎండుతున్న పంటలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ వాస్తవ పరిస్థితులపై ఆరా తీసి లక్ష ఎకరాల వరి పంట ఎండిపోయిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
కాళేశ్వరం నుంచి నీళ్ళు విడుదల చేయకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాజెక్టుల నుండి నీళ్ళు సరిగ్గా విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, విద్యుత్ కోతల వలన కూడా పంటలు ఎండినట్లు సమాచారం. నీరు లేక అనేక జిల్లాల్లో వరితో పాటు వేరుశనగ, మక్కజొన్న పంటలు కూడా ఎండిపోయినట్లు తెలుస్తోంది.ఏప్రిల్ నెలాఖరులో వరి పంట కోతకు వచ్చే సమయానికి ఇంకెన్ని ఎకరాలు ఎండిపోతాయో వ్యవసాయ నిపుణులు, రైతులు వాపోతున్నారు.