కరోనా నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులందరూ ఇళ్లోనే ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాబ్‌లలో వారు ఆన్లైన్ క్లాసులను వింటున్నారు. ఇక అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుంటున్నారు. అయితే వారందరూ ఇయర్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలా మందికి చెవి సమస్యలు వస్తున్నాయని ఈఎన్టీ వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిత్యం సుమారుగా 8 గంటల పాటు విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటున్నారని, ఆ సమయం మొత్తం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారని, అలాగే ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోంలో భాగంగా చాలా సేపు ఇయర్ ఫోన్స్ ను ధరిస్తున్నారని.. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈఎన్టీ వైద్యుల వద్దకు చికిత్సకు వస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఇంకా చాలా సమయమే పట్టే అవకాశం ఉన్నందున విద్యార్థులకు ఆయా సమస్యలు మరింత ఎక్కువై వినికిడి లోపం వచ్చేందుకు కూడా అవకాశం ఉందంటున్నారు. చాలా మంది గంటల తరబడి ఇయర్ ఫోన్స్‌ను ధరించడమే కాకుండా సాధారణం కన్నా మించి అధిక సౌండ్‌తో పాఠాలను వింటున్నారని.. దీని వల్ల చెవి సమస్యలు ఇంకా తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కనుక తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.
* గంటల తరబడి ఇయర్ ఫోన్లు పెట్టుకునే వారు మధ్య మధ్యలో వాటిని తీసి కొంత సేపు గాలి తగిలేలా చూడాలి.
* చెవిలో ఉండే గులిమిని తీయకూడదు. అది మనకు బాక్టీరియాలు, వైరస్లు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.
* ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు ఏవైనా సరే వాటికి అంతర్గత స్పీకర్లు ఉంటాయి. కనుక వాటి ద్వారా వచ్చే సౌండ్ సరిపోతుంది. ఇయర్ ఫోన్లు పెట్టుకుని మరీ క్లాసులు వినాల్సిన పనిలేదు.
* ఇయర్ ఫోన్లు పెట్టుకోదలిస్తే తక్కువ సౌండ్‌తో పాఠాలను వినాలి.
* ఉద్యోగులు కూడా నిరంతరాయంగా ఇయర్ ఫోన్లు పెట్టుకోకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలి.
ఈ సూచనలు పాటించడం వల్ల చెవి నొప్పి, ఇన్ఫెక్షన్, వినికిడి లోపం వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.