ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రాకముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కుర్చుని కుస్తీలు పట్టేవారు. ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో ఉద్యోగులు పిట్టల్లా రాలిపోయారు. ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినోళ్లు దూరమయ్యారు. అంగట్లో సరుకులు ఆకాశాన్ని అంటాయి. ఎంతో మంది రెండెకెల జీతం కోల్పోయి రోడ్డు పక్కన కూరగాయాలు, పండ్లు అమ్ముకున్నారు.
ఇక వలస కార్మికుల సంగతి వర్ణనాతీతం.. లాక్ డౌన్ లో బస్సులు, రైళ్లు లేక పిల్లాపాపలతో మైళ్ల దూరం నడిచి వెళ్లారు. ఈ మార్గంలో గమ్యస్థానం చేరే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లినవారూ.. ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పేపర్లో చూసినా తెలుస్తుంది వారి బతుకు పోరును ఏ విధంగా ముందుకు నెడుతున్నారనేది. ఇదిలా ఉంటే మరి జీవితాన్ని ఎలాగోలా వెల్లదీయాలిగా అనుకోని అప్పటివరకూ సుఖమైన జీవితాన్ని గడిపిన వారు ఎండలో పనులు మొదలుపెట్టారు.
లాక్ డౌన్ లో మెట్రో సర్వీసులకు బ్రేక్ పడింది. మరి అందులో ఉద్యోగం కోల్పోయిన వారు ఖాళీగా ఉండకుండా కుటుంబాన్నిపోషించుకోవటానికి ఏదోఒక పని చేయాలిగా.. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లా, నోవాడా గ్రామానికి చెందిన దాన్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఉద్యోగం కోల్పోయాడు. వేరో ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవి ఫలించలేదు. చేసేది ఏమీ లేక తన గ్రామంలోనే హెర్బల్ టీ తయారు చేసి అమ్మటం మొదలుపెట్టాడు.
అసలు అంతగా ఆ టీలో ఏముంది అనేగా మీ ప్రశ్న.. అయితే ఆయన మాటల్లోనే ఏం చెప్పాడో తెలుసుకోండి.. ‘‘మా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన గడ్డిని తలనొప్పులు, జ్వరాలు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు వాడుతారు. ఈ గడ్డిని వాడితే ఆరోగ్య సమస్యలు ఇట్టే పోతాయి. నేను అదే గడ్డిని తీసుకుని హెర్బల్ టీ తయారు చేశాను. కరోనా టైం కావడంతో.. నా టీకి మంచిగా పేరోచ్చింది. మా ఊరిలో దీనికి మంచి డిమాండే ఏర్పడింది. నాకు ఈ వ్యాపారం మెట్రోలో పనికంటే బాగుంది. చేతి నిండా డబ్బు.. లక్షల్లో ఆదాయం వస్తోంది.’’ అని దాన్ సింగ్ పేర్కొన్నాడు.