హైదరాబాద్ ఏపి, తెలంగాణలో అర్థరాత్రి 2.30 గంటలకు భూకంపం వచ్చింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో… భూ ప్రకంపనలు వచ్చాయి.
గుండ్రాయి, చిల్లకల్లు, జగ్గయ్య పేట బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో భూ ప్రకంపనలు వచ్చాయి. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. 2.40 గంటలకు 6 సెకన్లపాటు కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం గణతంత్ర దినోత్సవం రోజు పాతర్లపాడు, నాగులవంచ గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్థులు గుర్తుచేశారు.
అయితే రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.7గా నమోదైంది. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీనిపై జియోలాజికల్ సర్వే అధికారులు స్పందించారు. భయపడాల్సిన పని లేదన్నారు. ప్రకంపనలు సర్వ సాధారణం అన్నారు. వాటి తీవ్రత తక్కువగా ఉంటుందని, ఎలాంటి ప్రమాదం జరగదన్నారు. భూమి లోపలి పొరల్లో పలకల మధ్య ఒత్తిడి పెరిగి.. అప్పుడప్పుడు ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయని వివరించారు. దీంతో ప్రజలు కాస్త ఊరట చెందారు.