హైదరాబాద్ , మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల్లో ప్రజలను వర్షం ముప్పు తిప్పలు పెట్టిస్తే… ఆదిలాబాద్ జిల్లాలను భూ ప్రకంపనలు ప్రజలను భీతావహులను చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి కళ్లు తిరుగుతున్నట్లు జనం భీతిల్లిపోయారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి వాన దంచికొట్టింది. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్నది.
ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న రెండు రిజర్వాయర్లలోని భారీగా నీరు వచ్చిచేరుతున్నది. ఎగువనుంచి ఉస్మాన్‌సాగర్‌లోకి 900 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్‌సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల వరద వస్తున్నది. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. రెండు చెరువుల్లో నీటిని వదిలేయడంతో దిగువన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.