దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూకంపం వణికించిది. భూకంపత తీవ్రత 5.4గా నమోదయ్యింది. వారం రోజుల్లో రెండోసారి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరగులు పెట్టారు. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉత్తరాఖండ్ , ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో చాలా చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. పరిశోధకులు కూడా త్వరలోనే హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర నగరాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. చాలా మంది ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. దాదాపుగా 5 సెకన్ల పాటు భూమి కంపించింది. నోయిడా, గురుగ్రామ్ లో కూడా ఇదే విధంగా ప్రకంపనలు కనిపించాయి.
ఈ రోజు సాయంత్రం 7.57 గంటలకు నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ఫలితంగానే దేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి. భూకంప కేంద్ర భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. దేశరాజధానిలో ఇలా ప్రకంపనలు రావడం ఇది వరసగా రెండో సారి. మంగళవారం నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం రావడంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలో బలమైన ప్రకంపనలు సంభవిచాయి. ఈ భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. నేపాల్ లో ఆరుగురు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు.