పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో జరగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ నెలాఖరులో కొత్త భవనంలో సమావేశాలు ముగుస్తాయని వివరించాయి. ఈ తేదీలకు సంబంధించి తుది నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకుంటుందని వెల్లడించాయి.
రూ.1200 కోట్లతో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని ఈ నెలాఖరు లేదా డిసెంబరు మొదట్లో లాంఛనంగా ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబరు మూడోవారంలో ఆరంభమవుతాయి. 2017, 2018లో మాత్రం అవి డిసెంబరులో మొదలయ్యాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 1, 5న జరగనుండటమూ ఇక్కడ ప్రస్తావనార్హం.
శీతాకాల సమావేశాల్లోగానే కొత్త భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం మొదట్లో అనుకుంది. అయితే నిర్మాణానికి సంబంధించిన కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. భవనం పూర్తిగా సిద్ధమైనప్పటికీ సిబ్బందికి శిక్షణ ఇచ్చి, పూర్తిస్థాయిలో దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి 15-20 రోజులు పట్టొచ్చని అధికారులు తెలిపారు.