ఇరాన్‌లో భూకంపం.. ఏడుగురి మృతి.. పాకిస్థాన్​లోనూ ప్రకంపనలు

-

ఇటీవల తరచూ భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భూ ప్రకంపనల వల్ల పలుచోట్ల భవనాలు కూలిపోయి ప్రాణనష్టాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇరాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ ప్రజలను భూకంపం వణికించింది. ఇరాన్‌ – తుర్కియే సరిహద్దులో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని కోయ్‌ నగరంలో ఏడుగురు మరణించగా.. 440 మంది గాయపడ్డారు.

ఈ ఘటనలో పెద్దసంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు మీద పడి కొందరు మరణించగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి ఎక్కువమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న అటక్‌ నగర సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. తజికిస్థాన్‌ వద్ద 150 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పాక్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని.. ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం ఏదీ లేదని రేడియో పాకిస్థాన్‌ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version