చలికాలంలో సహజంగానే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వీటి వల్ల ఫైబర్, ప్రోటీన్లు మనకు లభిస్తాయి. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు, మలబద్దకం రాకుండా ఉంటాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ మనకు తగినంత శక్తిని అందించడంతోపాటు పోషణను కూడా ఇస్తాయి. అయితే కొందరు రెండో, మూడో రకాలకు చెందిన డ్రై ఫ్రూట్స్‌ను మాత్రమే తింటారు. అలా కాకుండా కింద తెలిపిన పలు రకాల డ్రై ఫ్రూట్స్‌ను తింటే.. దాంతో ఇంకా ఎక్కువ ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు.
* బాదంపప్పులను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
* డయాబెటిస్ ఉన్నవారు ఎండు ద్రాక్షను తినరాదు. కానీ ఆరోగ్యవంతులు వీటిని నిత్యం తినవచ్చు. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
* శరీరంలోని కొవ్వును కరిగించడంలో వాల్ నట్స్ కూడా బాగానే పనిచేస్తాయి. వీటిల్లో విటమిన్ బి, సి, కె, బి2లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* పిస్తా పప్పులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయి. మెటబాలిజంను పెంచుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది.
* చలికాలంలో వేడిగా ఉండేందుకు నిత్యం ఖర్జూరాలను తినాలి. డయాబెటిస్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. వీటిల్లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. అధికబరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ బి5 పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తిని పెంచుతుంది.
* జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నిషియం అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. శరీర మెటాబలిజంను క్రమబద్దీకరిస్తుంది.
* గుప్పెడు యాప్రికాట్స్ తింటే సుమారుగా 5 గంటల వరకు ఆకలి అనిపించదు. అందువల్ల అతిగా తినడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. అలాగే వీటిల్లో ఉండే మెగ్నిషియం మెటబాలిజంను పెంచుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది.
* అంజీర్ పండ్లను నేరుగా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. వీటి వల్ల మలబద్దకం తగ్గుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది.