బీజేపీలో చేరి, హుజూరాబాద్ బరిలో గెలిచిన దగ్గర నుంచి ఈటల రాజేందర్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు చెక్ పెట్టాలనే దిశగా ఈటల పనిచేస్తున్నారు. తనకున్న పాత పరిచయాలని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నేతలని బీజేపీలోకి లాగేస్తున్నారు. నెక్స్ట్ కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఈటల ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, అవసరమైతే వన్ మ్యాన్ షో మాదిరిగా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇదే బీజేపీలో కొందరు నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఈటల దూకుడు కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బండి సంజయ్, ఈటలకు పడటం లేదని కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈటల తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వెళ్ళడం, చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ…తనకు నచ్చిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు.
తాజాగా మునుగోడులో ఈటల దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. మునుగోడులో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన..అక్కడ ఉండే బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా చౌటుప్పల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చారు.
అయితే స్థానికంగా ఉండే బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వకుండా వెంకట్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. కనీసం కోమటిరెడ్డికి కూడా సమాచారం ఇవ్వలేదని మునుగోడు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం.
ఎందుకంటే వెంకట్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి…తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఆయన్ని అరెస్ట్ చేయించడానికి చూసింది. కానీ ఆయన సడన్ గా బీజేపీలో చేరిపోయారు. ఇలా కేసులున్న వ్యక్తిని చేర్చుకుంటే…పార్టీకే నష్టమని స్థానిక బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే మునుగోడులో గెలుపు కోసమే ఈటల దూకుడుగా పనిచేస్తున్నారు. అలాంటి సమయంలో అందరికీ నచ్చేలా రాజకీయం చేయాలంటే కష్టమైన పని. కాబట్టి బీజేపీ నేతలు సర్దుకుపోయి, కలిసికట్టుగా పనిచేస్తేనే మునుగోడులో గెలవగలుగుతారు.