మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా మార్చడంలో వాల్‌నట్స్ అద్భుతంగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది.
నేడు నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. కొంచెం ఆగినా తమకు అన్ని విధాలుగా నష్టం వస్తుందని భావిస్తున్న నేటి తరం పౌరులు జీవితంలో పరుగులు పెడుతున్నారు. అయితే ఓ వైపు పరుగులు పెడుతూ చక్కని ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవుతున్నారు కరెక్టే. కానీ మరో వైపు చూస్తే నిత్యం డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఆందోళనలతో వారు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగుల్లో మానసిక సమస్యలు వస్తున్నాయని, తీవ్రమైన డిప్రెషన్ బారిన పడుతున్నారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
డిప్రెషన్ అనేది ప్రస్తుత తరుణంలో ఓ సగటు నగర పౌరుడికి కామన్ అయిపోయింది. దాంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నా సరే.. దాన్నుంచి బయట పడాలి. పడేందుకు యత్నించాలి. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. యోగా, ధ్యానం చేయవచ్చు. శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. అలాగే పలు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా డిప్రెషన్ బారి నుంచి బయట పడవచ్చు. అలాంటి ఆహారాలలో వాల్ నట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి.
మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా మార్చడంలో వాల్‌నట్స్ అద్భుతంగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. వాల్‌నట్స్ నిత్యం తినే వారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు 26 శాతం వరకు తక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే వాల్‌నట్స్ తినడం వల్ల మూడ్ మారుతుందట. ఉత్సాహంగా ఉంటారట. ఏకాగ్రత కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్ల వాల్‌నట్స్‌ను నిత్యం తీసుకుంటే డిప్రెషన్ బారిన పడకుండా ఉండవచ్చని, డిప్రెషన్ ఉన్నా తగ్గుతుందని సైంటిస్టులు అంటున్నారు. కనుక డిప్రెషన్ ఉన్నవారు.. రోజూ ఒక గుప్పెడు వాల్‌నట్స్ తినండి.. ఆ తరువాత వచ్చే ఫలితాలను మీరే గమనిస్తారు..!