ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్(72) మరణించినట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ తెలిపారు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్‌కు గుండెపోటు వచ్చిందని.. వెంటనే దిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకునేలోపే అభిజిత్ సేన్ ప్రాణాలు కోల్పోయారని ప్రణబ్ వెల్లడించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారు. వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టుంది.
అభిజిత్ సేన్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు.