శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడి అధికారులు షాక్ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు సంజయ్ రౌత్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పత్రాచల్ భూముల కుంభకోణంలో సంజయ్ రౌత్ అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఉండడంపై ఆయన ఇంటిలో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈడి ఏప్రిల్ లోనే సంజయ్ రౌత్, భార్య వర్షా రౌత్ ఆయన సహచరులకు చెందిన సుమారు రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
పత్రచల్ భూ కుంభకోణంలో (మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో ఇదివరకే రెండుసార్లు ఆయనకు ఈడి సమర్లు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 7 తర్వాత మాత్రమే విచారణకు హాజరవుతారని సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున ముంబైలోని సంజయ్ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సంజయ్ రౌత్ నివాసం వద్ద సిఆర్పిఎఫ్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సంజయ్ రౌత్ మాత్రం తప్పుడు ఆరోపణలు, సాక్షాలతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారని.. తను ఈడీకి భయపడనంటూ తెలిపారు. ప్రాణం పోయినా బిజెపికి లొంగనని, శివసేనను వీడే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.