తెలంగాణ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులు దశాబ్దాల కాలం నుంచి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొండా మురళి…సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదుగుతూ వచ్చారు. అటు తన భర్త మురళి సపోర్ట్ తో కొండా సురేఖ రాజకీయంగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు.
1999, 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా…తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009లో పరకాలలో పోటీ చేసి గెలిచారు. అలాగే వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ మరణంతో ఆమె కాంగ్రెస్ ని వదిలి జగన్ పెట్టిన వైసీపీలో చేరి…2012 పరకాల ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి…2014లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు.
2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత దక్కక మళ్ళీ తన భర్తతో కలిసి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే 2018లో పరకాల బరిలో నిలబడి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి పరకాలలో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు…అదే సమయంలో వరంగల్ ఈస్ట్ పై కూడా కొండ ఫ్యామిలీ గురి పెట్టి పనిచేస్తుంది. ఈ రెండు సీట్లలో నెక్స్ట్ గెలుపే లక్ష్యంగా పెట్టుకుని కొండ ఫ్యామిలీ పనిచేస్తుంది.