ఆంధ్రావనిలో థియేటర్ల వివాదం,సినిమా టికెటింగ్ వ్యవహారం నడుస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఓ స్పష్టత ఇచ్చేందుకు, వివాదానికో ముగింపు ఇచ్చేందుకు ఇండస్ట్రీ పెద్దలు నిన్నటివేళ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో చిరంజీవి ఎంతో వినమ్రపూర్వక ధోరణిలో తన విన్నపాలు ఇండస్ట్రీ తరఫున తెలిపారు.
తాను కొత్తగా రూపొందించిన టికెటింగ్ విధానం చూశానని, ఎంతో బాగుందని సవరించిన ధరలు ఎంతో బాగున్నాయని కితాబిస్తూ, సమస్యకో పరిష్కారం చూపించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా చిన్న సినిమాకు సంబంధించి ఐదో షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రికి మరో మారు కృతజ్ఞతలు చెల్లించారు. మొత్తానికి జగన్ తో జరిగిన సమావేశం తరువాత ఓ సానుకూలత అయితే వచ్చింది. వివాదానికి ఓ పరిష్కారం అయితే చిరంజీవి ఇవ్వగలిగారు.
ఇక రాజమౌళి లాంటి పెద్దలు తమకు తెలిసిన ఇంగ్లీషులో సీఎంతో మాట్లాడి, ఇంతవరకూ టాలీవుడ్ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదురెదురుగా మాట్లాడుకున్న సందర్భాలు లేవని ఆ గ్యాప్ ను పోగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బాగున్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవన్నీబాగానే ఉన్నాయి కానీ చిన్నసినిమాను బతికించేందుకు ప్రభుత్వం తరఫున రాయితీలు అడిగితే ఎంతో మేలు అన్న వాదన మాత్రం బలీయంగా వినిపిస్తోంది.
ఐదో షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం బాగుంది కానీ ఇదొక్కటే సమస్యకు పరిష్కారం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమయినప్పటికీ అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో కానీ సినిమావాళ్లు అనుకున్నవి బాగానే సాధించుకున్నారు.
విశాఖలో ఇండస్ట్రీ ఏర్పాటుకు మాత్రం ప్రయత్నిస్తామన్న మాటకు మాత్రం ఎక్కడా ఎవ్వరూ కట్టుబడి ఉన్నవిధంగా వార్తలు అయితే రాలేదు. ముఖ్యమంత్రి తరఫున ప్రతిపాదనలు పెట్టినప్పటికీ చిరు కానీ రాజమౌళి కానీ ఎవ్వరూ కూడా ప్రపంచ స్థాయిలో సాంకేతిక విలువలు ఉన్న స్టూడియోల ఏర్పాటుకు ల్యాండ్ కు సంబంధించి కానీ ఇతర రాయితీలకు సంబంధించి కానీ ఏమీ అడగక పోవడమే ఆశ్చర్యం..