ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు..అయినా తెలంగాణ సిఎం కేసిఆర్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా 119 స్థానాలకు గాను..115 స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించారు. ఓ 9 సిట్టింగ్ స్థానాల్లో మినహా మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇక ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగారు. అయితే అందరికంటే ముందే అభ్యర్ధులని ప్రకటించడంతో..అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు.
బిఆర్‌ఎస్ మొదట లిస్ట్ విడుదల చేసి..ప్రతిపక్ష పార్టీలకు టెన్షన్ పెంచింది. అదే సమయంలో అభ్యర్ధులని ప్రకటించడంతో బిఆర్‌ఎస్ లో ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలవుతాయి. ఎందుకంటే సీటు దక్కని ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు ఏం చేస్తారు? మునుగోడులో పొత్తు పెట్టుకుని గెలిచి..తర్వాత కమ్యూనిస్టులని వదిలేయడంతో ఇప్పుడు వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అటు తాజాగా హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు వ్యవహారం ఏం చేస్తారు?
ఇవన్నీ బిఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ప్రశ్నలుగా మారిపోయాయి..మొదట సీటు దక్కని ఎమ్మెల్యేలు ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. ఆమె బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్తారని తెలుస్తోంది.
ఇటు కమ్యూనిస్టులకు సడన్ షాక్ ఇవ్వడంతో..వారు కాంగ్రెస్ తో కలిచే ఛాన్స్ ఉంది. అలాగే టికెట్ దక్కని సీనియర్లు బిఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనచారి లాంటి వారు ఏం చేస్తారో చూడాలి. ఇక నాలుగు సీట్లు పెండింగ్ లో పెట్టారు. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ సీట్లలో ఎవరిని నిలబెడతారో చూడాలి. మొత్తానికి అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించాకే బిఆర్‌ఎస్ లో అసలు కల్లోలం మొదలుకానుంది.