కొత్త పార్టీ కొత్త హామీ అంటూ కొత్తకొత్తగా కనిపించాలని తాపత్రయ పడుతున్నారు తెలంగాణ తాత కేసీఆర్.ఆ విధంగా ఆయన మరో ఎత్తుగడ వేశారు.దీంతో చంద్రబాబుకు చెమట్లు పోస్తున్నాయి.అస్సలు ఊహించని విధంగా ఆయన నుంచి ప్రకటన రావడంతో తెలుగుదేశం వర్గాలు విస్తుబోతున్నాయి. అసలే నానా తిప్పలూ పడుతూ పార్టీని నిలబెట్టుకునేందుకు బాబు ఉన్న సమయం కాస్తా కేటాయిస్తుంటే ఇప్పుడేంటి ఈ తలనొప్పి అని పసుపు పార్టీ వర్గాలు అంతర్మథనంలో పడిపోయాయి.ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తన కన్నా కాస్తో కూస్తో ఎక్కువ ఎదుగుదలనే అందుకున్న చంద్రబాబుకు,అదేవిధంగా పిల్లాడయిన జగన్ కు ఏక కాలంలో కేసీఆర్ ఊహించని విధంగా ఝలక్ ఇచ్చారు.దీంతో ఇప్పుడు టీడీపీ,వైసీపీ రెండూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ జాతిరత్నమే!
కేసీఆర్ ఏం చెప్పినా బాగుంటుంది.కేసీఆర్ ఏం చెప్పకపోయినా కూడా బాగుంటుంది.పదాడంబరం ఉండదు.వాగాడంబరం ఉండదు.ఆయనకు ఏం అనిపిస్తే అదే చెప్తారు.ఏం అనిపిస్తే అదే చేస్తారు.కొన్ని సార్లు మోతాదుకు మించి తిడతారు.కొన్ని సార్లు మోతాదుకు మించి పొగుడుతారు కూడా! ఆయనేం చేసినా చెల్లుతుంది. ఆ విధంగా ఆయన తెలంగాణ వాకిట తిరుగులేని సీఎంగా వర్థిల్లుతున్నారు.రాణిస్తున్
ఇక జాతి కోరితే జాతీయ పార్టీ పెడతానని అంటున్నారు.అందుకోసం కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధంగానే ఉన్నాయని అంటున్నా రు.ఆ రోజు తెలంగాణ ఏర్పాటు అప్పుడు కూడా తాను ఇదే విధంగా పనిచేశానని, ముందు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ను నెలకొల్పితిరుగులేని విజయం సాధించామని అంటున్నారు.అవును! కేసీఆర్ అనుకుంటే సాధిస్తాడు అనేందుకు అనేక రుజువులు ఉన్నా యి.ఆ క్రమంలో తెలంగాణ సాధనకు ఆయనే కాదు అనేక రాజకీయ శక్తులు తోడు అయ్యాయి.తోడ్పాటు అందించాయి.కానీ ఉద్యమ పార్టీగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిపోయింది.
ఓ విధంగా ఇప్పటికిప్పుడు పార్టీ తీసుకురాలేకపోయినా కూడా కేసీఆర్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు.ఎందుకంటే ఇవాళ తెలంగాణ వాకిట టీఆర్ఎస్ కు తిరుగులేదు.జాతీయ స్థాయిలో అయితే పెద్దగా రాణించలేకపోయినా,ఢిల్లీలో ఇప్పటికీ అంతో ఇంతో సానుభూతి రాజకీయాలు నడిపిన పార్టీగా గుర్తింపు అయితే పొందే ఉంది.అందుకే కేసీఆర్ తనదైన పంథాలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తిచేసి త్వరలోనే అక్కడి నుంచి రాజకీయం నడిపేందుకు వ్యూహం నడపాలని యోచిస్తున్నారు.ఏ విధంగా చూసిన తెలుగు రాష్ట్రాల వరకూ ఆయన జాతి రత్నమే!
– రత్నకిశోర్ శంభుమహంతి