ఎడిట్ నోట్: కవితకు ఉచ్చు..కానీ.!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదేపేస్తున్న విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ లిక్కర్ స్కామ్ లో బడా బడా నేతల పేర్లు బయటపడుతున్నాయి. ఇప్పటికే కీలక వ్యక్తులు అరెస్ట్ కూడా అయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సి‌ఎం మనీష్ సిసోడియా సైతం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ లిక్కర్ స్కామ్…రెండు తెలుగు రాష్ట్రాలని సైతం వణికిస్తుంది.. ఈ కేసులో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం అరెస్ట్ అయ్యారు. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ అరెస్ట్ అయ్యారు.

అటు విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇంకా పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ లిక్కర్ స్కామ్ తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎప్పటినుంచో కవిత పేరు లిక్కర్ స్కామ్ లో వినిపిస్తూనే ఉంది. అలాగే ఆమె మాజీ ఆడిటర్ ని సైతం అరెస్ట్ చేశారు. ఇక ఆమెని సి‌బి‌ఐ సైతం విచారణ చేసింది. ఈడీ రిపోర్టులో ఆమె పేరు పదే పదే ప్రస్తావనకు వస్తుంది. తాజాగా ఆమె పేరు మరోసారి బయటపడిన విషయం తెలిసిందే.

ఇక ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్‌ మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఆయన రిమాండ్‌ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది. పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు కవితకు బినామీలని స్పష్టం చేసింది. అయితే తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరామని అరుణ్‌ పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌ తమ విచారణలో అంగీకరించారని తెలిపింది.

దీంతో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని అర్ధమవుతుంది. ఇక ఆమె అరెస్ట్ తరువాయి అని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో రాజకీయంగా చూస్తే కవితని అరెస్ట్ చేస్తే మహిళా సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి కే‌సి‌ఆర్ ఏదైనా చేస్తారని అంచనా వేస్తున్నారు. ఆయనకు సెంటిమెంట్ తో రాజకీయం చేయడం వెన్నతో పెట్టిన విద్య..కాబట్టి కవిత అరెస్ట్ అయితే ఎలా ముందుకెళ్తారనేది అర్ధం కాకుండా ఉంది. చూడాలి మరి కవిత విషయంలో ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version