మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కోవర్టుల కలకలం రేగింది..కాంగ్రెస్, బీజేపీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తాజాగా సీనియర్ నేత, బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రతిపక్షాల్లో కేసీఆర్ ఇన్‌ఫార్మర్లు ఉన్నారని, వారు కేసీఆర్‌కు సాయం చేస్తూ..ఉన్న పార్టీల్లో గొడవలు సృష్టిస్తారని చెప్పుకొచ్చారు. అంటే కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ, వారితో కథనాలను ప్రచారం చేయిస్తారని, చివరికి ఈ పార్టీలకంటే చివరకు కేసీఆర్ దిక్కు అని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని ఈటల తెలిపారు.
ఇక తన కదలికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా పెట్టారని, 2018 ఎన్నికల సందర్భంగా గోల్కొండ హోటల్‌లో కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులే టీ కప్పులు అందించారని, కొందరు పోలీసు అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా మారారని ఈటల ఆరోపించారు. కొన్ని కేసుల్లోనైతే ఏ సెక్షన్లు పెట్టాలో కూడా కేసీఆరే సూచిస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు.
అయితే ఈటల వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎటున్న చర్చ నడుస్తోంది. కొన్ని లాజిక్‌లు చూస్తే ఈటల చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణకు కాంగ్రెస్ పరిస్తితి చూస్తే..ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది గాని..ఆ పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. దీని వల్ల ప్రజల్ కాంగ్రెస్ పార్టీపై చిరాకు పడే పరిస్తితి. వీళ్ళు ఎప్పుడు ఇలాగే కుమ్ములాడుకుంటారని అనుకుంటున్నారు.
అటు బిజేపిలో కూడా ఈ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇలా రెండు పార్టీలు సరిగగా లేవని చెప్పి ఫైనల్ గా ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూసేలా చేసుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనే ప్రచారం వస్తూనే ఉంది. కాబట్టి ఈటల వ్యాఖ్యల్లో కాస్త అర్ధం ఉందని అంటున్నారు.
అదే సమయంలో అసలు ఈటల..కేసీఆర్ కోవర్టు అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ పై పోరాటం చేస్తానని చెబుతున్న ఈటల బిజేపి చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ…బిఆర్‌ఎస్ నేతలపై ఫోకస్ చేయకుండా..కాంగ్రెస్ నేతలని బిజేపిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులని కోట్ల ఆఫర్లు ఇచ్చి బిజేపిలోకి తీసుకెళ్లడానికి స్కెచ్ వేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అటు బిఆర్‌ఎస్ లో బిజేపి మనషులు ఉన్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో క్లారిటీ లేదు. మొత్తానికి తెలంగాణలో కోవర్టుల రాజకీయం నడుస్తోంది.