ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సినిమా’ సక్సెస్..?

-

మొత్తానికి ఎమ్మెల్యేలకు ఎర అనే ఎపిసోడ్ పాన్ ఇండియా లెవెల్‌లో కాదు గాని..తెలంగాణ వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక హడావిడి నడుస్తుండగానే బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు..టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు బేరసారాలు చేసిన ఆడియో, వీడియోలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్ చేశారని తెలిసింది.

ఇక దీనిపై రోహిత్ రెడ్డి ముందుగానే కేసీఆర్‌కు సమాచారం ఇవ్వడం, ఇక బేరం ఆడిన ముగ్గురు వ్యక్తులని పక్కా ఆడియో, వీడియోలతో పట్టుకున్నారు..అలాగే వారిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టారు. అయితే దీనిపై కేసీఆర్ అప్పుడే స్పందిస్తారని అంతా అనుకున్నారు..కానీ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక అయ్యే వరకు ఆగారు. మునుగోడు ప్రచారం సభలో కొనుగోలు అంశాన్ని కాస్త చెప్పారు. ఇక మునుగోడు ఉపఎన్నిక ముగియడం, అన్నీ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడం..లాంటి పరిణామాల తర్వాత కేసీఆర్ అనూహ్యంగా ప్రెస్ మీట్ పెట్టి..ఈ కొనుగోలు వ్యవహారంపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ మాట్లాడారు. ఇక వారు బేరాలకు సంబంధించిన ఆడియో, వీడియోలని ప్రదర్శించారు. ఆ వీడియోల్లో ఇదంతా అమిత్ షా, కేరళకు చెందిన బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ల ప్రోద్బలంతోనే తాము చేస్తున్నామని ముగ్గురు నిందితులు మాట్లాడడం పెనుదుమారం రేపింది. మోదీ పేరు కూడా రెండు సార్లు ప్రస్తావనకు రావడంతో సంచలనమైంది.

మొదట ప్రెస్ మీట్‌లో బాధతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానని, నెల రోజుల క్రితమే ఈ కొనుగోళ్లు షురూ అయ్యాయని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇస్తామన్నా వదిలేసి, తెలంగాణను బతికించారని, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చేస్తామన్న విషయాలన్నీ అందులో ఉన్నాయని కేసీఆర్ సంచలన వీడియోలు బయటపెట్టారు. ఈవీఎంలు ఉన్నంత వరకూ బీజేపీకి ఢోకా లేదని వాళ్లు చెబుతున్నారని.. విపక్ష పార్టీలను కూల్చే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారని, సుప్రీం కోర్టు ఈ అంశాన్ని విచారించాలని, రాజ్యాంగయేతర శక్తులకు చెక్ పెట్టాలని చెప్పి కేసీఆర్..డైరక్ట్‌గా మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నాన్ స్టాప్‌గా మాట్లాడారు.

అయితే ఈ కొనుగోలు అంశంలో ఇంకా ఊహించని అంశాలు బయటకొస్తాయని, పాన్ ఇండియా సినిమా లెవెల్‌లో ఉంటుందని గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో కేసీఆర్ ‘సినిమా’ సక్సెస్ కాలేదని చెప్పొచ్చు..దాదాపు బయటకొచ్చినవే మళ్ళీ వీడియోలు వేశారు..కాకపోతే వీడియోలో ఇంకా ఏం జరిగిందో ఎక్కువ చూపించారు.

ఇక దీని ద్వారా కేంద్రంలో తనకు మైలేజ్ పెరగడం, మోదీ సర్కార్‌కు డ్యామేజ్ జరగడం లాంటివి కష్టమే. కాకపోతే రాష్ట్ర స్థాయిలో దూకుడుగా ఉన్న బీజేపీకి కాస్త బ్రేకులు పడేలా..తమకు కాస్త అడ్వాంటేజ్ పెరిగేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే కొనుగోలు అంశంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారే…వీరే కాదు..ఇంకా కొంతమంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలని సైతం కేసీఆర్ లాక్కున్నారు. మరి ఆ అంశాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తారు. మొత్తానికి కేసీఆర్ ‘సినిమా’ పాన్ ఇండియా స్థాయిలో లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version