ఎడిట్ నోట్ : మా అభ్యంత‌రాలు వినండి జ‌గ‌న్ ?

-

తీపి ఎక్క‌డుందో వెత‌కండి
అవ‌స‌రం అనుకుంటే ఆ తీపినే పంచండి
రానున్న కొత్త ఏడాదిలో తీపి మ‌రియు చేదు
రెండూ ఉంటాయి ఉండాలి కూడా
కానీ చేదు ఓ అనుభ‌వం అయినా తీపి ఓ జ్ఞాప‌కం అయినా
ఇవాళ వాటికి కార‌ణం అందుకు ప్ర‌ధాన బాధ్య‌త వ‌హించాల్సింది
పాల‌కులే.. నవ్యాంధ్ర రీతులు మార్చేస్తాం అని చెబుతున్న తీరులో
వాళ్లేం సాధిస్తారో..అన్న‌దే సందేహాల‌కు సంకేతిక..

పాల‌న అంటే శాస్త్రీయ‌త‌కు ప్రామాణిక రూపం కానీ జ‌గ‌న్ పాల‌న లో అలాంటివి కోరుకోవ‌డంలో అంటే పెద్ద త‌ప్పిద‌మే! డ‌బ్బులు లేని వేళ కొత్త కొత్త త‌ల‌నొప్పులు నెత్తి మీద ఎలా తెచ్చి పెడతార‌ని? క‌నీసం ఓ రోడ్డు మ‌ర‌మ్మ‌తుకు కూడా నిధులు ఇవ్వ‌లేని జ‌గ‌న్ ఎందుక‌ని కొత్త కొత్త ప్ర‌తిపాద‌న‌లు తీసుకువ‌స్తున్నార‌ని? ఈ విధంగా ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తే అధికారంలో ఉన్న‌వారికి కోపం వ‌చ్చినా శాస్త్రీయ దృక్ప‌థం, వాస్త‌విక ప‌రిశీల‌న, సాధ్యా సాధ్యాల అన్వేష‌ణ, విచ‌క్ష‌ణ‌తో కూడిన పాల‌న అన్న‌వి జ‌గ‌న్ కు ఇవాళ అత్య‌వ‌స‌రం అని చెప్ప‌క త‌ప్ప‌దు. కానీ ఇవేవీ లేకుండానే పాల‌న సాగించ‌డంతో ఇవాళ అవ‌శేషాంధ్ర‌కు కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు.

ఉగాది వ‌స్తోంది అంటే కొంత తీపి కొంత చేదుల క‌ల‌బోత‌గా ఉన్న కాలం ఒక‌టి క‌ళ్లెదుటే ఉంటుంది.తెలుగు వారి ఆనందాల‌కు ఆది ఉగాది. తెలుగు వారి లోగిళ్ల‌లో ఈ సారి ఉగాది కాస్త రాజ‌కీయ రంగుల‌ను కూడా పులుముకుని తీర‌డం ఖాయం. ఎందుకంటే యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌నలో వేగం పెంచుకునేందుకు చేస్తున్న లేదా  చేయాల‌న‌కుంటున్న సంస్క‌ర‌ణ‌లే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో ఓ అనూహ్య మార్పున‌కు శ్రీ‌కారం దిద్ద‌నున్నామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. జ‌గ‌న్  కు అనుగుణంగా జిల్లాల ఏర్పాటులో ఉన్న అశాస్త్రీయ‌త‌ను అర్థం చేసుకోకుండానే అధినేత‌ను పొగుతున్నారు వైసీపీ వ‌ర్గీయులు.

ఈ నేప‌థ్యం కొత్త జిల్లాల‌కు నిధులు ప్ర‌ధాన సమ‌స్య అని మీడియాలో క‌థ‌నాలు విపరీతంగా వ‌స్తున్నాయి. ఇవి ఏ విధంగా స‌ర్క్యులేట్ అయినా కూడా జ‌గ‌న్ ప‌ట్టించుకోరు.ఈనాడు లో వ‌స్తే చంద్ర‌బాబు వాయిస్ గానే చూస్తున్నారు త‌ప్ప వాటిని క్షేత్ర స్థాయి లో నెల‌కొన్న ప‌రిణామాల‌కు అక్ష‌ర రూపంగా చూడ‌డం లేదు.పోనీ సాక్షి అయినా శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో వార్త‌లు రాస్తుందా అంటే అదీ లేదు.దీంతో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా కొత్త కార్యాల‌య‌ల ఏర్పాటు నిర్వ‌హ‌ణ సంబంధిత బాధ్య‌త‌లకు సంబంధించి ఓ అస్ప‌ష్ట వైఖ‌రి నెల‌కొంది. అధికారుల్లో అస‌హ‌నం కూడా పెరిగిపోతోంది.

ముఖ్యంగా ప‌ని విభ‌జ‌న పై ఇవాళ్టికీ ఓ స్ప‌ష్ట‌త లేదు. కార్యాల‌యాల ఏర్పాటు (తాత్కాలిక ప్రాతిప‌దిక ) పై ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన నిధుల ఏ పాటీ స‌రిపోవు. అయినా కూడా జ‌గ‌న్ ఇవి పట్టించుకోవ‌డం లేదు. జిల్లాకు మూడు కోట్లు విడుద‌ల చేసి స‌ర్దుకోండి అంటున్నారు.దీంతో విశాఖ లాంటి జిల్లాలు ఏమ‌యిపోవాలి అని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తే లేదా అధికారులే విన్న‌విస్తే వేటినీ ఆయ‌న విన‌రు..వినిపించుకోరు.
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Exit mobile version