అమరవీరుల త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రం నేటితో 10 వసంతంలోకి అడుగుపెడుతుంది. విద్యార్థుల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలంతో.. ఆరు దశాబ్దాల కల నిజమైంది. ఆంధ్రా వాళ్ళ అధికారంలో నలుగుతున్న తెలంగాణకు విముక్తి లభించింది. నిధులు, నియమకాలు అంటూ సాగిన తెలంగాణకు ఊపిరి వచ్చిన రోజు జూన్ 2, 2014. ఆ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ ఏడాది జూన్ 2కి తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ధ కాలం పూర్తవుతోంది.
1969లోనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం మొదలైంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు.
అదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. అప్పుడు ఉద్యమం తారస్థాయిలో కొనసాగింది. కాకపోతే రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని కారణాలతో ఉద్యమం చల్లబడింది. అయితే ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధంగా నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ఆ తర్వాత పలు దశల్లో తెలంగాణ కోసం కొందరు నేతలు ఉద్యమించారు గాని.. అవి అంతగా ముందుకెళ్లలేదు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ నినాదంతో 2001లో అధికారంలో టీడీపీని వదిలి మరీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయటకొచ్చి..తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.
అయితే మొదట్లో అనుకున్న విధంగా తెలంగాణ ఉద్యమం సాగలేదు. కేసిఆర్ పార్టీ పెట్టిన మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టిడిపిలతో పొత్తులతో ముందుకెళ్లారు. కానీ అసలు పోరాటం 2009 తర్వాతే మొదలైంది. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసిఆర్ 2009 నవంబర్ 27న అమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తరువాత కేసీఆర్ అరెస్ట్.. ఇక హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేశారు. కేసిఆర్ దీక్షతో విద్యార్థి లోకం భగ్గుమంది..అన్నీ వర్గాలు ఉద్యమంలోకి వచ్చాయి. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది.
ఇదే సమయంలో ఎల్బీ నగర్ లో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నారు. అప్పుడే తెలంగాణపై కేంద్రంలో కదలిక వచ్చింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న ప్రకటన చేసింది. తరువాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయింది..అన్నీ పార్టీలు తెలంగాణ కోసమే నినదించాయి. ఇక తెలంగాణ తప్ప మరో ఎజెండా లేదు. ఇదే క్రమంలో కేంద్రం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. అయినా ఉద్యమం ఆగలేదు.. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె ఉద్యంలో కీలక ఘట్టాలు నడిచాయి. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు.
ఇన్ని పోరాటలతో 2014 ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. ఇక జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. నేటితో 10వ ఆవిర్భావ వేడుకలు మొదలయ్యాయి.
కేసీఆర్ మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయులు..ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్.. జయ జయహే తెలంగాణ అంటూ నినదించిన అందెశ్రీ..నాన్ ముల్కీ నుంచి తెలంగాణ సాధన వరకూ కీలక పాత్ర పోషించిన కేశవరావ్ జాదవ్..తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచారి..అనేక మంది విద్యార్ధుల బలిదానాలు..ఉద్యమాన్ని సమన్వయం చేసుకుంటూ నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం…ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్నీ వర్గాల ప్రజలు..ఇలా ప్రతి ఒక్కరూ పొరాడి తెలంగాణని సాధించుకున్నాయి.