ఆంధ్రావనిలో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కొత్త చర్చ ఒకటి నడుస్తోంది. బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి. వీటితో పాటు అంతర్మథనాలూ జరుగుతున్నాయి. అంతః కలహాలూ రేగుతున్నాయి. రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా అన్న మాదిరిగా కూడా కొంత విభిన్న పంథాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సమీకరణాలు సంబంధిత పరిణామాలు క్షణానికో మారు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్లను తప్పిస్తారని కూడా సమాచారం. వైఎస్సార్ హయాం నుంచి ఇప్పటి జగన్ వరకూ ఆయన వివిధ సందర్భాలలో మంత్రి పదవి అనుభవించారు. వైఎస్సార్ చనిపోగానే ఆయన పార్టీ మారింది లేదు.
అప్పటికీ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ వ్యహారాలను సరిదిద్దే పనిలో కీలక పదవిలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆయన పీసీసీ బాస్. వైఎస్సార్ మరణం అనంతరం సీఎం పదవి ఇవ్వాలంటూ జగన్ కోరిన కోరిక ఒకటి అప్పట్లో హల్చల్ చేసింది. ఈ తరుణంలో ఆయన కూడా జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడారు. ఇవి కూడా సంచలనం అయ్యాయి. తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ధర్మాన ప్రసాదరావు మాదిరిగానే బొత్స సత్యనారాయణకు కూడా జగన్ అవకాశం ఇవ్వరని,ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టరని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటన్నింటిని తోసిపుచ్చుతూ జగన్ అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకుని మున్సిపల్ శాఖను అప్పగించారు. కొలువు దీరిన జగన్ క్యాబినెట్ అన్న వార్తలో ఆయన కూడా చోటు దక్కించుకుని అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచారు.
తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన మాట చెల్లలేదు. సచివాలయంలో చాలా మంది ఉన్నతాధికారులతో ఆయన వాగ్వాదాలు అయ్యాయి అన్న వార్తలు కూడా వెలుగు చూశాయి. తరువాత ఆయన కొంత కాలం జగన్ కు దూరంగా జరిగి తన పని తాను చేసుకుంటూ పోయారు. పార్టీ ఆదేశాలు అనుసారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే ఉన్నా, అవి కూడా మనఃస్ఫూర్తిగా చేసిన పనులు కావు. ఆయనకు రామకృష్ణా రెడ్డి కన్నా సాయిరెడ్డితోనే ఎక్కువ తగాదా. ఎందుకంటే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జ్ కనుక !
పేరుకు పార్టీ పదవిలో ఉన్నా సాయిరెడ్డి పెత్తనం మాత్రం చాలా ఎక్కువగానే ఉండేది. భూ తగాదాల్లో కూడా ఆయన ఇరుక్కున్నారు. దీంతో జగన్ కూడా కొంత విసిగిపోయారు. సాయిరెడ్డిని తప్పించి పార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్ర వ్యవహారాలను బొత్స సత్యనారాయణ చూసుకుంటే బాగుంటుందని కూడా అనుకున్నారు. కానీ కాలేదు. ఇప్పుడు మంత్రి వర్గంలో తనకు చోటు ఉంటుందో లేదో తెలియదని దేవుడిపైనే భారం వేశానని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు బొత్స. ఒకవేళ ఆయనను తాజా మంత్రివర్గంలో తీసుకోకుంటే, ఉత్తరాంధ్ర పొలిటికల్ ఎఫైర్స్ కు సంబంధించి సాయిరెడ్డిని తప్పించి బొత్సకు ఆ బాధ్యత అప్పగించడం ఖాయం.