తెలంగాణ బీజేపీ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని చీఫ్ గా నియమించి కొంత మంది నేతలకు పదవులు ప్రకటించిన తర్వాత .. ఇక వలసలు ఉండవని అనుకున్నారు. కానీ అభ్యర్థులు ఫైనల్ చేసే పరిస్థితికి వచ్చే సరికి పెద్ద పెద్ద నేతలు జంప్ అవబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇందులో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి వంటి నేతలు ఉన్నారు. నిజంగానే వీరంతా అదే ఆలోచనలో ఉంటే.. మరికొంత మంది సీనియర్లు కూడా తమ దారి తాము చూసుకుంటారన్న చర్చ జరుగుతోంది.
ఇది ఇలా ఉంటె, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. భద్రాద్రి ఇల్లందులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాషాయ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఖమ్మం సభలో ప్రకటన చేస్తామన్నారు.