బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రానున్న వారం రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం తీరం దాటే సమయంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముంపుప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ముందస్తు చర్యలు సైతం చేపడుతున్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలోనే కాకినాడలోని ఏలేరు జలశయానికి 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, ప్రస్తుత నీటి నిల్వ 21.65 టీఎంసీలుగా ఉన్నది. దీంతో కిర్లంపూడి, పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దాపురం, సామర్లకోటకు వరద ముప్పు పొంచి ఉందని, ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.