మార్చిలో కరోనా లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయిలే లాక్ డౌన్ ఎత్తేశాక కూడా చాలా మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కానీ కరోనా పూర్తిగా లేకపోయినా.. అనేక మంది ఉద్యోగులు మాత్రం ఆఫీసులకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇళ్ల నుంచే పనిచేస్తామని చెబుతున్నారు. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ది మావెరిక్స్ ఇండియా అనే సంస్థ గత 3 నెలల కాలంలో దేశంలోని పలు నగరాల్లో సర్వే చేసింది. మొత్తం 720 మంది ఉద్యోగుల నుంచి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో వెల్లడైందేమిటంటే.. కరోనా పూర్తిగా తగ్గిపోయినా.. అసలు దాని ప్రభావం లేకపోయినా.. ఇకపై శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేస్తామని సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది చెప్పారు. అందుకు అవసరం అయితే వేతనంలో 10 శాతం మొత్తాన్ని కోల్పోయేందుకు కూడా సిద్ధమని వారు తెలిపారు.
ఇక ఇంటి నుంచి పనిచేస్తుండడం వల్ల 56 శాతం మంది ఉత్పాదక రేటు పెరిగిందని చెప్పారు. ఆఫీసుల్లో కన్నా ఇంట్లో నుంచి విధులు నిర్వర్తిస్తేనే ఎక్కువ పనిచేయగలుగుతున్నామని తెలిపారు. అలాగే సర్వేలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు 80 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకే మొగ్గు చూపారు. ఇక ప్రజలపై మీడియా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అని అడగ్గా అందుఉ 95 శాతం మంది కచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పడం విశేషం. అలాగే యాంటీ చైనా సెంటిమెంట్ కూడా ఉద్యోగుల్లో పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది.