ఇంగ్లండ్ ప్రవాసుల్లో భారతీయులే ఎక్కువట..

-

పాశ్చాత్య దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం మనవారేనని తెలిపింది. ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తాజా నివేదిక వెల్లడించింది.

బ్రిటన్‌ జాతీయ గణాంక కార్యాలయ (ఓఎన్‌ఎస్‌) నివేదిక-2021 ప్రకారం, ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న వారిలో బ్రిటన్‌ బయట జన్మించిన వారి సంఖ్య 2011లో 75లక్షలుగా ఉంది. 2021 నాటికి అది కోటికి చేరుకుంది. గడిచిన పదేళ్లలో వీరి సంఖ్య 25లక్షలు (13శాతం నుంచి 16శాతానికి) పెరిగింది. ఈ జాబితాలో భారత మొదటి స్థానంలో ఉంది. గతేడాది అక్కడ నివాసమున్న వారిలో 9,20,000 మంది భారతీయులుండగా.. తర్వాతి స్థానంలో పోలండ్‌ (7,43,000), పాకిస్థాన్‌ (6,24,000)లు ఉన్నట్లు ఓఎన్‌ఎస్‌ వెల్లడించింది. 2011లో భారతీయుల సంఖ్య 6,94,000గా ఉంది.

లండన్‌లో నివసించే వారిలో ప్రతి పది మందిలో నలుగురు (40శాతం) బ్రిటన్‌ బయట జన్మించినవారే కావడం విశేషం. అయితే, గడిచిన పదేళ్లలో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. రొమేనియా నుంచి పనికోసం వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేసిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. మరోవైపు.. అమెరికా, జమైకా నుంచి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version