అహ్మదాబాద్‌ టీ20.. భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

-

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ అలవోకగా ఛేదించింది. ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోగా భారత్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి డకౌట్‌ అయ్యాడు. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌లు వెంట వెంటనే ఔటయ్యారు. శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టును ఆదుకున్నాడు. 48 బంతులు ఆడిన అయ్యర్‌ 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 67 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. రిషబ్‌ పంత్‌ (21 పరుగులు), హార్దిక్‌ పాండ్యా (19 పరుగులు)లు కొంత సేపు నిలదొక్కుకునే యత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితం కావల్సి వచ్చింది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసిన ఆర్చర్‌ 1 మేడిన్‌తో 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు తీశాడు. అలాగే ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌, బెన్‌ స్టోక్స్‌లు కూడా తలా 1 వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ 49 పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో చాహల్‌కు 1, వాషింగ్టన్‌ సుందర్‌కు 1 వికెట్‌ దక్కాయి. ఈ విజయంతో ఇంగ్లండ్‌ 5 టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version