రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంపై నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. వెంకయ్య నివాసానికి చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ నేతలతో భేటీ నిమిత్తం ఢిల్లీకి బయలుదేరారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ తరుణంలో వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రుల భేటితో ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు కానుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల కోసం కేంద్ర మంత్రులు, ముగ్గురు కార్యదర్శులు, 14 మంది ప్రముఖ నేతలతో బీజేపీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్రపతి అభ్యర్థులుగా పలువురి పేర్లు ప్రతిపాదనలు చేశారు. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా వినిపిస్తోంది.