కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది పీఎఫ్‌ను విత్‌డ్రా చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో అధిక శాతం మంది ఇప్పటి వరకు దాచుకున్న పీఎఫ్‌ను విత్‌డ్రా చేసి తమ అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం పీఎఫ్ కోసం ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకున్నా.. అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అందుకు కారణాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే…
బ్యాంకు సమాచారం తప్పుగా ఉండడం…
ఈపీఎఫ్‌లో రికార్డుల్లో వినియోగదారులకు చెందిన బ్యాంకు సమాచారం తప్పుగా ఉంటే.. పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ వంటి వివరాలు కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంకు వివరాలను ఈపీఎఫ్‌వో సైట్‌లో ధ్రువపరుచుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పుట్టిన తేదీ తప్పుగా ఉండడం…
పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలనుకునే చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. అయితే దీన్ని సరిదిద్దుకోవాలంటే.. ఈపీఎఫ్‌వో సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ పుట్టిన తేదీని సరిచేసి అందుకు తగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే.. వారం రోజుల్లోగా సమస్య పరిష్కారం అవుతుంది.
కేవైసీ పూర్తిగా చేయకపోవడం…
పీఎఫ్ క్లెయిమ్ చేయాలనుకునే వారు కేవైసీని పూర్తి చేసి ఉండాలి. వినియోగదారులు తమ బ్యాంకు, ఆధార్, పాన్, చిరునామా.. తదితర అన్ని వివరాలను ఈపీఎఫ్‌వో సైట్‌లో కన్‌ఫాం చేసుకోవాలి. దీంతో క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే ప్రాసెస్ అయి డబ్బు చేతికి వస్తుంది.
స్కాన్ చేసిన డాక్యుమెంట్లు క్లియర్‌గా లేకపోవడం…
ఆధార్, పాన్, బ్యాంకు పాస్ బుక్ లేదా చెక్‌బుక్ వంటి డాక్యుమెంట్లను కేవైసీ కోసం అప్‌లోడ్ చేస్తుంటారు. అవి క్లియర్‌గా లేకపోయినా.. పీఎఫ్ క్లెయిమ్‌లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కనుక ఆయా డాక్యుమెంట్లను స్పష్టంగా కనిపించేలా స్కాన్ చేసి మరోసారి అప్‌లోడ్ చేయాలి. దీంతో ఈ సమస్య పరిష్కారమవుతుంది.
ఆధార్‌కు, యూఏఎన్‌కు లింక్ చేయకపోవడం…
ఆధార్, యూఏఎన్ లను లింక్ చేయకపోయినా.. పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అందుకుగాను రెండింటినీ లింక్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ నంబర్‌తో లాగిన్ అయి ఆధార్‌తో లింక్ చేస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.