తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు నిష్క్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తాజాగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న ఆయన టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం వరంగల్‌లో ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో తాను టీఆర్ఎస్‌కు ఎందుకు రాజీనామా చేయనున్నానన్న విషయాన్ని ఆయన తన అనుచరులకు చెప్పనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్‌కు రాజీనామా తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ఖరారుపైనా ఆయన తన అనుచర వర్గానికి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.