కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్స్ తో నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్స్ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు.
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు. పదేళ్ల పాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మమ్ముల్ని తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 11వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం పదేళ్లపాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదు. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతీ నెల రూ.600 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు.