తల్లితండ్రులు అందరూ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారు చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో ఎంతో పొదుపు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆడపిల్లలు పెళ్లి వయసుకు వచ్చేసరికి ఎంతో ఖర్చు అవుతుంది అని ముందుగానే ఖర్చులను తగ్గించుకొని చాలా పొదుపు చేస్తారు. ఈ విధంగా ప్రణాళికలు చేసుకోవడం సులభం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి ఒకే విధంగా ఉండదు. పైగా ఎన్నో అనుకోని ఖర్చులు కూడా ఏర్పడతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాల ద్వారా తల్లిదండ్రులు పిల్లల కోసం పొదుపు చేయవచ్చు మరియు దాని పై వడ్డీని కూడా పొందవచ్చు.
ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన
ఈ పథకం ద్వారా ఆడపిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రులకు 2000 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు కేవలం పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తే ఈ డబ్బును పొందవచ్చు. అయితే దీనిని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకానికి కేవలం బీహార్ లోని శాశ్వతంగా నివసించే వారు మాత్రమే అర్హులు మరియు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ లేక కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయవచ్చు లేక అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ దరఖాస్తును చేయవచ్చు.
బేటి బచావో బేటి పడావో పథకం
ఈ పథకం ద్వారా ఆడపిల్లల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించారు మరియు అబార్షన్ నుంచి రక్షించడానికి ఈ పథకాన్ని ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా ఏ ప్రాంతాలలో అయితే లింగ నిష్పత్తి తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఆస్తి వారసత్వంలో సమాన హక్కును ప్రోత్సహిస్తున్నారు మరియు లింగ ఆధారిత అబార్షన్ ను నిరోధిస్తున్నారు. ముఖ్యంగా విద్యావ్యవస్థలో ఆడపిల్లలు చేరే విధంగా నిర్ధారిస్తున్నారు.
సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకం ఆడపిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పొదుపు చేసి సుకన్య సమృద్ధి ఖాతాలో డబ్బును వేయవచ్చు. ఈ విధంగా డిపాజిట్ చేయడం వలన మెచ్యూరిటీ సమయానికి వడ్డీతో పాటుగా డబ్బులను పొందవచ్చు. కేవలం సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రైవేట్ బ్యాంకు లేక పోస్ట్ ఆఫీస్ ద్వారా తెరిచి ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి కనీసం 250 రూపాయలను పెట్టుబడి చేయవచ్చు. ఈ విధంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు మరియు 21 సంవత్సరాలు తర్వాత మొత్తం డబ్బులను తీసుకోవచ్చు.
బాలిక సమృద్ధి యోజన
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో దారిధ్యరేఖకు దిగువన నివసించే కుటుంబాల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లల చదువు కోసం వార్షికంగా స్కాలర్షిప్ ను అందజేయడం జరుగుతుంది. బాలిక సమృద్ధి యోజన కోసం ఆన్లైన్ లేక ఆఫ్లైన్ లో దరఖాస్తును సమర్పించి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పధకం లో భాగంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆర్థిక సహాయంగా తల్లిదండ్రులకు 500 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు క్రమంగా ఆడపిల్లల చదువు ప్రకారం ఆర్థిక సహాయాన్ని వార్షికంగా అందజేస్తారు.