సాధారణంగా మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే.. కొన్ని పోస్టులు మాత్రమే ఉంటాయి. కానీ అభ్యర్థులు మాత్రం వేలు, లక్షల్లో పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో ఆ పోస్టులకు పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కొద్ది మందికే ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుంది. అయితే గోవా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో మాత్రం కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పాస్ కాలేదు. అందరూ ఫెయిలయ్యారు. అవును, మీరు విన్నది నిజమే.
గోవా ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్‌లో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది జనవరి 7వ తేదీన పరీక్షను కూడా నిర్వహించింది. కాగా మొత్తం 80 పోస్టులకు గాను 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తరువాత అందరూ పరీక్ష రాశారు. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే.. కనీసం ఒక్కరు కూడా ఆ పరీక్షల్లో పాస్ కాలేకపోయారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస విద్యార్హతగా డిగ్రీని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్క పోస్టుకు గాను దాదాపుగా 100 మంది వరకు పోటీ పడ్డారు. కాగా వంద మార్కులకు జరిగిన ఈ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకుంటేనే తరువాత జరిగే ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత లభిస్తుంది. కానీ పరీక్షల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఈ పరీక్షల తాలూకు ఫలితాలు ఇటీవలే వెలువడగా ఇప్పుడీ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమే అయింది.