ఆయనైతే గెలుపు గ్యారెంటీ అనుకున్నారు. ఇష్టపడి ఏరికోరి తెచ్చుకున్నారు. కానీ.. ఆయన ఓడిపోయారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఓడిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. పార్టీ కార్యక్రమాలకూ రావడం లేదు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో పావులు కదిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాజీ మంత్రి కొండ్రు మురళీని టీడీపీలో చేర్చుకున్నారు. మురళీకి స్థానికంగా మంచి పేరు ఉండటం.. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి గుడ్‌విల్ సంపాదించారు. ఈ లెక్కలన్నీ వేసుకుని 2019 ఎన్నికల్లో మురళీకి టికెట్ ఇచ్చారు చంద్రబాబు.
అప్పటి వరకూ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ప్రతిభా భారతికి ఇది ఇబ్బందికరమైనా చంద్రబాబు నిర్ణయాన్ని ఎదురించలేకపోయారు. పైగా ప్రతిభా భారతిపై ఉన్న వ్యతిరేకతతో రాజాం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు కొండ్రు నాయకత్వాన్ని స్వాగతించాయి. ఇదే సమయంలో కొండ్రు తనతో కాంగ్రెస్‌లో పని చేసిన కేడర్‌ను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో అది స్థానిక తెలుగు తమ్ముళ్లు, ఆయనకు మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. ఈ గొడవల నుంచి తేరుకొనే లోపుగానే వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు రాజాంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ కొండ్రు మురళీని ఓడించాయనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు రాజాం తమ్ముళ్లకు కొత్త సమస్య వచ్చిందట. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచీ కొండ్రు మురళీ రాజాం రావడం లేదట. ఆ మధ్య చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటనకు వస్తే.. కాసేపు సమీక్షలో పాల్గొని ముఖం చాటేశారట. దీంతో నియోజకవర్గంలో టీడీపీని లీడ్ చేసే నేతలు లేరని అంటున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించడం కూడా కొండ్రును ఆ పార్టీకి దూరం చేసిందనే టాక్ నడుస్తోంది. విశాఖలో పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్నెళ్ల క్రితమే సమర్ధించిన కొండ్రు.. టీడీపీ లైన్‌కు తాను కట్టుబడి ఉండటం లేదని తేల్చారు. ఆ ప్రకటనతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిపోతారనే ప్రచారం జరిగింది. కొండ్రు మాత్రం ఔనని కానీ.. కాదని కానీ ఏనాడూ చెప్పలేదు.
ప్రస్తుతం రాజాంకు రాకుండా..తన సొంత పనులపై పొరుగు జిల్లాలోనే ఉండిపోతున్నారట కొండ్రు మురళీ. దీంతో పార్టీ సమస్యలు.. ఇతర అంశాలను ఎవరికి చెప్పుకోవాలో టీడీపీ కేడర్‌కు తెలియడం లేదట. ఎన్నికల ముందు వరకూ రాజాం పాలిటిక్స్‌లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తలదూర్చే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావ్ సైతం కరోనా సమయంలో అటువైపుగా చూడటం మానేశారు. ఒకప్పుడు వర్గవిబేధాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాజాంలో ఇప్పుడు ఏ వర్గానికీ ఓ దిక్కంటూ లేని పరిస్థితి నెలకొందట. మరి.. రాజాం విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.