తమిళ ప్రజల తలరాత ‘తలైవా’ మారుస్తాడా…?

-

తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టించేలా పార్టీ పెడుతున్నట్టు స్పష్టం చేశారు రజనీకాంత్. కొత్త ఏడాదిలో పార్టీ ప్రకటిస్తానని తేల్చేశారు. దీంతో రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రజనీకాంత్ అనుకున్నట్టుగా తమిళ రాజకీయాల్ని మార్చగలరా అనేది చర్చనీయాంశంగా మారింది.

రజనీకాంత్ తమిళనాడులోనే కాదు.. దక్షిణాదిలోనే సూపర్ స్టార్. ఆ మాటకొస్తే దేశం వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న కొద్దిమంది హీరోల్లో ఒకరు. రజనీ డైలాగ్ చెప్తే ఫాన్స్ ఊగిపోతారు. ఆ స్టైల్ కి వెర్రెత్తిపోతారు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానులను సాధించుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే మాట ఇప్పటిది కాదు. 1996 నుంచి అంటే పాతికేళ్ల పైగా వినిపిస్తూనే ఉంది. ఆ ఎన్నికలు, ఈ ఎన్నికలు అనుకుంటూ దశాబ్దాలు గడుస్తున్నాయి. కానీ, రజనీకాంత్ బాల్కనీలోకొచ్చి అభిమానులకు చేతులు ఊపటం, ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టడం తప్ప ఈ దిశగా సాధించింది పెద్దగా లేదు. రజనీ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే చర్చ ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ ఉత్కంఠకు ఎట్టకేలకు మూడేళ్ల కింద రజనీ తెర దించారు.కానీ దాన్ని ఆచరణలోకి మాత్రం ఇప్పటికి తీసుకొచ్చాడు.

2017 డిసెంబరులో 5 రోజులపాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ చివరిరోజున.. అరసియల్‌ కు వరువదు ఉరుది అంటే రాజకీయాల్లోకి రావడం ఖాయం అని బహిరంగంగా ప్రకటించారు. రాజకీయాల్లో సిస్టమ్ సరిగ్గా లేదు, దాన్ని మారుద్దాం..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో పోటీచేస్తాం అని వ్యాఖ్యానించారు. అభిమాన సంఘాలను మక్కల్ మన్రాలుగా మార్చారు. ఇన్చార్జ్లను నియమించారు. సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ ఒక్కమాటతో సరిపెట్టుకున్న రజనీ మళ్లీ యథావిధిగా తన గూటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా, చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు పెరిగాయి.

ఇపుడు జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృత‍జ్ఞతలు తెలిపారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

రాజకీయాల్లో ప్రవేశించే ముందు రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా కొవిడ్‌ వల్ల అది సాధ్యపడలేదన్నారు రజనీకాంత్ . తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీ పిలుపునిచ్చారు. ఇపుడు కాకపోతే ఇంకెపుడు అన్నారు. నేను గెలిస్తే అది ప్రజా విజయం, నేను ఓడినా అది ప్రజా ఓటమే అని ఆయన అన్నారు. తలైవా పాలిటిక్స్ లోకి రావాలని బాషా సినిమా టైమ్ నుంచి అభిమానులు అడుగుతూనే ఉన్నారు. ప్రతి సూపర్ హిట్ సినిమాలోనూ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఊరిస్తున్నట్టుగా డైలాగ్ చెప్పించడం కూడా డైరక్టర్లకు అలవాటైపోయింది. దేవుడు శాసించేదెప్పుడు.. రజనీ రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు అన్న అభిమానుల ప్రశ్నలకు ఇప్పుడు జవాబు దొరికినట్టే.

కమల్ హాసన్ కు, రజనీకాంత్ కు ఫ్యాన్ బేస్ పరంగా చాలా తేడా ఉంది. కమల్ మంచి నటుడే కానీ.. సూపర్ స్టార్ కాదు. రజనీకాంత్ సూపర్ స్టార్. ఫుల్లుగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. రజనీకి ఎవరికి ఓటేయమంటే వారికి ఓటేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే గతంలో రజనీ మాటకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఏది ఏమైనా సూపర్ స్టార్ డైరక్టుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. కచ్చితంగా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులు చీలతాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తమిళనాడులో అందరు హీరోల అభిమానులు, చివరకు హీరోలందరూ కూడా రజనీ అభిమానులే అనే ప్రచారం కూడా ఉంది. అలాంటప్పుడు రజనీ పార్టీ కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని తలైవా అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

ఓపక్క తలైవా వృద్ధుడైపోతున్నాడు. 70ఏళ్ల వయస్సు, అనారోగ్యం ఉండనే ఉంది. నిజానికి రాజకీయాల్లోకి రావాలంటే అటో ఇటో తేల్చుకునే తెగింపు, జనం నాడి పట్టుకునే తెలివి ఉండాలి. ఇవి రజనీకాంత్‌ కి ఏ మేరకున్నాయనేది సందేహమే. ధైర్యంగా ముందుకొచ్చిన రాజకీయాల్లో నిలబడి ఉంటే ఈపాటికి తలైవా అభిమానులు కోరుకునే స్థానంలో ఉండేవాడేమో. అప్పట్లో రజనీ ప్రకటన జయ ఓటమికి కొంతవరకు కారణంగా మారి ఉండొచ్చు. కానీ, రాజకీయ ఎత్తుగడలకు అవసరమైన అనుభవం రజనీకాంత్‌ కు లేదు. ఓ నిర్ణయం తీసుకునే సత్తా లేదు. నటుడిగా టాప్ అయినా, వ్యక్తిగా మంచివాడనే ముద్ర ఉన్నా, ఇవన్నీ రాజకీయాల్లో పనికిరావు. పైగా ఆర్థిక బలమూ అంతంతమాత్రమే. ఇన్ని పరిమితుల మధ్య తలైవా రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ఇంకా ప్రశ్నగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version