బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌వి అన్ని బోగస్ మాటలు అని మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు వచ్చి అవకాశం వచ్చిందని.. ఇది అందరి బాధ్యత అని గుర్తుచేశారు.
కేసీఆర్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారని తెలిస్తే, అంబేద్కర్ ఇంకా కొన్ని కొత్త అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచేవారని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక ఉండరాదని, అసలు ప్రతిపక్షమే ఉండకూడదంటూ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను ఇది అవమానించడమేనని అన్నారు. ఇప్పుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా… ప్రజలకు చెందిన ఖజానాలోని వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని జూపల్లి మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ప్రభుత్వ నిధులతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజలను ఇంతగా మోసపుచ్చడం ఎక్కడా లేదని అన్నారు.