విద్యాసంస్థల విషయం సహా నియజకవర్గం సమస్యలపై వైసీపీలో ఆనంను ఒంటరి చేస్తున్నారా? నెల్లూరులో పదేళ్ల కిందటి వరకు ఓ వెలుగు వెలిగిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిల హవా వివేకా మరణంతోనే పోయిందా? ఇప్పుడు రామ నారాయణ రెడ్డి ఆటలో అరిటి పండు మాదిరిగా మారిపోయారా? అంటే.. ఔననే అంటున్నారు నెల్లూరు జిల్లా రాజకీయ పరిశీలకులు సుదీర్థ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి.. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిం చారు. తర్వాత రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడంతో ఆయన అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పదవిని ఆశించినా.. భంగపడ్డారు.
చివరకు తనకు ఎంతో కలిసి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గం టికెట్ కోసం పట్టుబట్టినా ఫలితం కనిపించకపోవడంతో వైసీపీ లోకి వచ్చారు. ఇక్కడ కూడా ఆయన కోరుకున్న సీటు దక్కక పోయినా వెంకటగిరి స్థానం లభించి… గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, జగన్ కేబినెట్‌లో ఆయనకు మంచి పదవి లభిస్తుందని ఆనం వర్గం ఆశలు పెట్టుకున్నా.. జగన్‌కు అత్యంత సన్నిహితుడు మేకపాటి గౌతంరెడ్డికి ఇక్కడ నుంచి చాన్స్ లభించింది. అదేసమయంలో బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్‌కు జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. ఆ తర్వాత నామినేటెడ్ పదవైనా దక్కుతుందని ఆనం ఆశ పెట్టుకున్నారు. కానీ, అది కూడా పోయింది. ఇక, ప్రభుత్వ అధికార ప్రతినిధి హోదా అయినా దక్కుతుందని అనుకున్నా.. అది కూడా ఫలించలేదు.
దీంతో ఆయన దాదాపు మౌనం పాటించారు. ఇప్పటికే ఇన్ని భారాలతో ఉన్న ఆనంకు జిల్లాలోనే పేరెన్నికగన్న విద్యా సంస్థకు చైర్మన్ గిరీ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బోర్డును రద్దు చేయడం, ఈ విషయంలో వైసీపీ మంత్రి అనిల్ సహా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి పూర్తిగా ఆనంకు వ్యతిరేకం అయింది.గతంలో రాజ కీయంగా తమను ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో ఆనంను కోటంరెడ్డి టార్గెట్ చేయడం, అనిల్ కూడా లెక్కచేయకపోవడం ఆనంకు ఇబ్బందికరంగా మారాయి. ఈ ఇద్దరిపై ఆయన జగన్ కు కూడా వివరించారు. ఈ నేపథ్యంలోనే 20 రోజుల కిందట జగన్ స్వయంగా ఈ ఇద్దరితో చర్చించి ఆనంకు గౌరవం ఇవ్వాలని పరోక్షంగా సూచించారు.
అంతేకాదు, సదరు విద్యా సంస్థ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని జగన్ సూచించారు. దీంతో కోటంరెడ్డి, అనిల్ ఇద్దరూ కూడా ఆనం విషయంలో సైలెంట్ అయ్యారు. విద్యా సంస్థ గురించి పెద్దగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే, ఆయనను మాత్రం గుర్తించకపోవడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల జిల్లా వైసీపీ సమీక్ష నిర్వహించినప్పుడు ఆనంకు అసలు ఆహ్వానమే అందలేదు. పైగా వెంకటగిరి నియోజకవర్గం సమస్యలపైనా ఎవరూ పట్టించుకోవడం లేదనే ప్రచారం కూడా ఉంది. తన వర్గానికి కూడా పార్టీలో ఆనం న్యాయం చేయలేక పోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఆనం అటు పార్టీపైనా, ఇటు స్థానిక నేతలపైనా ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. మరి ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో చూడాలి.